ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన‌ట్లుగా…ఇప్పుడు మ‌హేంద‌ర్ రెడ్డి గెలుపు మల్లారెడ్డి మంత్రి ప‌ద‌వికి ఎస‌రు పెట్టేలా ఉంది.మ‌ల్లారెడ్డి తోపు..ద‌మ్ముంటే ఆపు అన్న మాట‌లు న‌మ్మి ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు సీఎం కేసీఆర్. అంతే కాదు, త‌న సిట్టింగ్ స్థాన‌మైన మ‌ల్కాజ్ గిరి పార్ల‌మెంట్ టికెట్ ను ఏరికోరి త‌న అల్లుడికి ఇప్పించుకున్న మ‌ల్లారెడ్డి..అక్క‌డ టీఆర్ఎస్ ను గెలిపించ‌లేక రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయి కేసీఆర్ ప‌రువు తీశాడు.


రాష్ట్రంలో ఎక్క‌డ ఓడిపోయినా ఫ‌ర్వాలేదు కానీ, మ‌ల్కాజ్ గిరిలో మాత్రం రేవంత్ రెడ్డిని మ‌ట్టి క‌రిపించాల‌న్న కేసీఆర్ త‌ప‌న‌ను త‌ల‌కిందులు చేశాడు. దీని కార‌ణంగా మ‌ల్లారెడ్డిని మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం గ‌త‌కొంత కాలంగా జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారం అయితే సాగుతుంది కానీ, మ‌ల్లారెడ్డిని త‌ప్పిస్తే ఆయ‌న స్థానంలో ఎవ‌రిని భ‌ర్తీ చేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.కానీ,తాజాగా మ‌హేంద‌ర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందడంతో ఆ ప్ర‌శ్నార్థ‌కానికి స‌మాధానం ల‌భించిన‌ట్ల‌యింది.

రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో అత్యంత బ‌ల‌మైన శ‌క్తిగా ఉన్న మ‌హేంద‌ర్ రెడ్డిని మంత్రివ‌ర్గంలోకి తీసుకోవ‌డం ప‌క్కాగా కనిపిస్తోంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న పేరు ఉండ‌టం ఖాయ‌మంటున్నారు టీఆర్ఎస్ నేత‌లు.ఈ ప్ర‌చారం తాండూరులో ఆయ‌న ఓడిన‌ప్ప‌టి నుంచే జ‌రుగుతోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు..కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాన‌ని మాటిచ్చి మ‌రీ నిల‌బెట్టుకున్నాడు మ‌హేంద‌ర్ రెడ్డి.కాంగ్రెస్ గెలిస్తే కాబోయే సీఎం తానేనంటూ రాష్ట్ర‌వ్యాప్తంగా క‌లియ‌తిరుగుతూ..టీఆర్ఎస్ పార్టీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారిన రేవంత్ రెడ్డికి క‌ళ్లెం వేస్తూ.. త‌న తమ్ముడు ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి చేతిలో దారుణంగా ఓడించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందాడు మ‌హేంద‌ర్ రెడ్డి.కానీ, త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన తాండూరులో యంగ్ లీడ‌ర్ పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో అతికొద్ది ఓట్ల‌తో ఓట‌మి పాల‌య్యాడు.


తాను ఓడిపోయిన‌ప్ప‌టికీ,రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ సీట్లు గులాబీ వ‌శం కావ‌డంలో మ‌హేంద‌ర్ రెడ్డి కీల‌క‌పాత్ర పోషించాడు.కాబ‌ట్టి..త‌ప్ప‌కుండా మ‌రోమారు మ‌హేంద‌ర్ రెడ్డిని కేసీఆర్ కెబినెట్లో చేర్చుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావ‌డంతో ఇక ఆయ‌న మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం ఖాయం అంటున్నారు పార్టీ నేత‌లు.

మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. మ‌హేంద‌ర్ రెడ్డిని మంత్రివ‌ర్గంలోకి తీసుకునేందుకే చేవెళ్ల పార్ల‌మెంట్ టీఆర్ఎస్ టికెట్ ను ఆయ‌న‌కు కాకుండా,పారిశ్రామిక‌వేత్త రంజిత్ రెడ్డికి ఇచ్చార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కొడంగ‌ల్ అసెంబ్లీ మాదిరి,చేవెళ్ల పార్ల‌మెంట్ లోనూ టీఆర్ఎస్ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని అంతా భావించారు.కానీ,చేవెళ్ల‌లోనూ గులాబీ జెండా ఎగ‌ర‌వేస్తాన‌ని మాటిచ్చి మాట నిలుపుకున్న మ‌హేంద‌ర్ రెడ్డిని ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించి ఆయ‌న‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇక ఎమ్మెల్సీగా బంప‌ర్ మెజార్టీతో విక్ట‌రీ కొట్టిన మ‌హేంద‌ర్ రెడ్డికి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చోటు ఖాయ‌మైపోయింద‌నే ప్ర‌చారం ఇప్పుడు రెట్టింపు కావ‌డం విశేషం.


అయితే..మ‌హేంద‌ర్ రెడ్డిని మంత్రిని చేసేందుకు మ‌ల్లారెడ్డిని త‌ప్పించాలా అనే సందేహం రావ‌చ్చు.. ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంది.మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున గెలిచిన స‌బితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలుసు క‌దా..అయితే,ఆమె పార్టీలో చేరిన సంద‌ర్భంలోనూ మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ట‌. వాస్త‌వానికి ఆమె త‌నయుడైన కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని కోరింద‌ట‌.కానీ, అందుకు అంగీక‌రించ‌ని అధిష్టానం మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చింద‌ట‌.ఆ హామీ మేర‌కు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే విస్త‌ర‌ణ‌లో స‌బితా రెడ్డికి చోటు క‌ల్పించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.


మ‌హిళా శాస‌న‌స‌భ్యుల్లో ఈసారి ఇద్ద‌రికి కానీ,ముగ్గురికి కానీ మంత్రివ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పిస్తామని కేసీఆర్ ఇంత‌కు ముందే ప్ర‌క‌టించినందున‌.. ఆ లిస్టులో స‌బితారెడ్డి పేరు క‌న్ఫాం అయింద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు చెప్తున్నాయి.ఇక పార్టీని బ‌లోపేతం చేసినందుకు గానూ,అసాధ్యం అనుకున్న స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపును సుసాధ్యం చేసినందుకు గాను మ‌హేంద‌ర్ రెడ్డికి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఎలాగు మ‌ల్లారెడ్డి శాస‌న‌స‌భ స‌భ్యుడిగా గెలిచింది తొలిసారే కాబ‌ట్టి,ఆయ‌న్ను ప్ర‌స్తుతానికి తొల‌గించి ఇంకేదైనా ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చున‌ని పార్టీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: