గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 175 స్థానాల అసెంబ్లీలో ఏకంగా 151 సీట్లు సాధించిన ఆ పార్టీలో.. మంత్రిపదవులపై ఆశలు పెట్టుకున్నవారు సహజంగానే అధిక సంఖ్యలో ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారెవరో శుక్రవారం తేలిపోనుంది. సీనియర్లతో పాటు జూనియర్లు సైతం రేసులో ఉన్నారు.  ప్రతి లోక్‌సభా స్థానాన్ని జిల్లాగా మారుస్తానని.. తద్వారా రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేస్తానని జగన్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 


అందుచేత ఆయన మంత్రివర్గంలో 25 మందికి అవకాశం కల్పించే అవకాశముందని అంటున్నారు. మంత్రివర్గంలో సీఎం, 25 మందికి స్థానం కల్పిస్తే.. 125 మంది ఎమ్మెల్యేలు మిగిలిపోతారు. వీరిలో ఒకరికి స్పీకర్‌గా, మరొకరికి డిప్యూటీ స్పీకర్‌గా, ఒక చీఫ్‌విప్‌, ఇద్దరు విప్‌లను నియమిస్తే.. ఇంకా 121 మంది ఉంటారు. వారిలో సీనియర్‌ శాసనసభ్యులు కూడా ఉన్నారు. మంత్రి పదవుల రేసులో చాలా మంది ఉన్నా.. కేబినెట్‌ కూర్పులో సామాజిక సమీకరణలు పాటించడం తప్పనిసరి. కొందరు సీనియర్లను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే వీలుండకపోవచ్చని.. పదవులు దక్కనివారు నిరాశచెందవద్దని జగన్‌ శుక్రవారం వైసీఎల్పీ భేటీలో నచ్చజెబుతారని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి..

కేబినెట్‌ పై కసరత్తు..
శనివారం అసెంబ్లీ ప్రాంగణం వెలుపల మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. కేబినెట్‌ కూర్పుపై చేసిన కసరత్తు గురించి శుక్రవారం వైసీఎల్పీ భేటీలో జగన్‌ వివరించనున్నట్లు తెలిసింది. ప్రజలు వైసీపీపై అపారమైన విశ్వాసం ఉంచి 151 స్థానాల్లో గెలిపించారని.. 22 మందిని లోక్‌సభకు పంపారని.. వారి విశ్వాసాన్ని పారదర్శక పాలనతో.. అవినీతి రహిత విధానాలతోనూ నిలుపుకోవాలని సీఎం జగన్ సూచించనున్నట్లు తెలుస్తుంది.. 

శనివారం చాంబర్లోకి సీఎం జగన్‌..
ముఖ్యమంత్రిగా జగన్‌ శనివారం సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మొదటి బ్లాకులోని సీఎం చాంబర్లోకి ప్రవేశించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: