ఎవ్వరూ ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద ట్విస్టు ఇచ్చారు. రేపు ఏర్పాటు చేయబోయే క్యాటినెట్ ను రెండున్నరేళ్ళ తర్వాత మార్చేయబోతున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. ఇపుడు ఏర్పాటు చేయబోయే మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ళ తర్వాత మార్చేస్తానని ఏ ముఖ్యమంత్రి కూడా ముందుగా చెప్పరు. అదికూడా ఎంఎల్ఏలు, ఎంల్సీలను సమావేశపరిచి బహిరంగంగా చెప్పటమంటే చాలా ధైర్యముండాలి.

 

రెండున్నరేళ్ళ తర్వాత మంత్రుల పనితీరును సమీక్షించి ఎవరెవరిని పక్కన పెట్టాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పగానే అందరూ హర్షధ్వానాలతో ఆమోదం తెలపటం గమనార్హం. అంటే జగన్ నిర్ణయానికి ప్రజా ప్రతినిధులందరూ తమ ఆమోదాన్ని తెలపటమే.

 

పైగా మంత్రివర్గాన్ని పూర్తిగా ఒకేసారి తీసుకోబోతున్నట్లు కూడా చెప్పారు. ఏ ముఖ్యమంత్రి కూడా మొత్తం 25 స్ధానాలను భర్తీ చేయరు. భవిష్యత్ అవసరాలకు కొన్ని ఖాళీలను అట్టే పెట్టుకుంటారు. కానీ అటువంటి ఆలోచన జగన్ లో కనబడలేదు. ఇపుడు మంత్రివర్గంలోకి  తీసుకోబోతున్న వారిని రెండున్నరేళ్ళ తర్వాత మార్చేస్తానని ధైర్యంగా చెప్పటమంటే జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

అలాగే సమావేశంలో జగన్ మరో విషయాన్ని కూడా చెప్పారు. పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు కూడా పార్టీ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. టిడిపి హయాంలో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్సీల్లో చాలామంది పార్టీ కార్యాలయాలకు వెళ్ళలేదు. చంద్రబాబు ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. దాని ఫలితంగా ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది.

 

సరే పాదయాత్రలో జగన్ ముందుగానే చెప్పినట్లుగానే ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటి, కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. మంత్రివర్గంలో కూడా పై వర్గాలకు బాగా ప్రాతినిధ్యం ఇవ్వనున్నారు. కాబట్టి సమాజంలో వెనుకబడిన వర్గాలకే తన తొలి ప్రాధాన్యతగా జగన్ స్పష్టం చేశారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: