ప్రజల పక్షాన పోరాటం
‘మనం మంచి చేశాం. ఎవరికీ చెడు చేయలేదు. అయినా ఫలితం ఇలా వచ్చింది. దీనికి బాధపడకుండా ముందడుగు వేయాలి. ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడాలి’ అని తనను కలిసేందుకు వచ్చిన తెదేపా కార్యకర్తలకు పార్టీ అధినేత చంద్రబాబు ఉద్బోధించారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అనంతపురం, కడప, గుంటూరు, కృష్ణా, నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు ఆయనను గురువారం కలిశారు. ‘మీరు ఎంత కష్టపడ్డారో, మాకోసం ఎంత చేశారో తెలుసు. కష్టనష్టాల్లో మీ వెంటే ఉంటాం. మీ కోసం, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధం’ అని ఈ సందర్భంగా చంద్రబాబుతో కార్యకర్తలు అన్నారు. ‘మీ విలువేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పది రోజుల్లోనే కొత్త ముఖ్యమంత్రి పాలన ఏమిటో ప్రజలకు తెలిసిపోయింది.


మీరు చేసినంత ఎవరూ చేయలేరు. ఈ రోజు అనంతపురం, కడప శివారు ప్రాంతాలకు కృష్ణా నీళ్లు చేరాయంటే అది మీ కష్టమే’ అని చెప్పారు. ‘1984 నుంచి పోరాటాలతోనే మీరు విజయవంతమయ్యారు. మళ్లీ పోరాటానికి సిద్ధం కావాలి. పార్టీని సమాయత్తం చేయాలి. మా ధైర్యం, అండదండ మీరే. మీ వెంటే చివరి వరకు నడుస్తాం’ అని తెలిపారు.
‘నాయకుడంటే మీలా ఉండాలి. మేము విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసింది మీ కోసమే. మీ వల్లే విదేశాల్లో ఇంజినీర్లుగా స్థిరపడ్డాం’ అని ప్రవాసాంధ్రులు చెప్పారు.

మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్‌, ప్రభాకర్‌చౌదరి, గద్దె బాబురావు, తెదేపా నేతలు దేవినేని అవినాష్‌, పంచుమర్తి అనూరాధ, హిదాయత్‌, సాయిబాబు, సాంబశివరావు, సూర్యనారాయణరాజు, సూర్యానారాయణరెడ్డి తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: