ఏపీ కేబినెట్‌లో కీలకమైన హోంమంత్రిగా మహిళా ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన వైయస్ జగన్..తాజాగా హోం మంత్రిగా మహిళా ఎమ్మెల్యేను నియమించినట్లు తెలుస్తోంది..ఇంతకీ ఆ  హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే మహిళా ఎమ్మెల్యే ఎవరు అనేదానిపై సర్వత్రా ఉత్కం‎ఠ నెలకొంది. కాగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మొత్తం 09 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో చాలా వరకు సీనియర్లు ఉండగా.. జూనియర్లు మాత్రం తక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరిలో మేకతోటి సుచరితకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. మిగిలిన వారిలో సీనియర్ అయిన  రోజా పేరు దాదాపు ఖరారు అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. కీలకమైన హోంశాఖ మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేస్తుందని, ఈ మేరకు రాత్రికల్లా అధికారికంగా జగన్ ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.


 మంచి వాగ్ధాటి, ధైర్య సాహసాలు కలిగిన రోజా వంటి డేరింగ్ ఎమ్మెల్యే అయితేనే హోం‎శాఖ బాధ్యతలను అవలీలగా మోస్తారని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా ఎమ్మెల్యేను హోం మంత్రిగా ప్రకటించడంలో జగన్ తన తండ్రిని ఫాలో అవుతున్నట్లు వైసీపీ నేతలు అంటున్నారు.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రి బాటలోనే జగన్ కూడా నడుస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. సబితా హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు శాంతి భద్రతలు విషయంలో ఎక్కడా రాజీలేకుండా పనిచేశారని ప్రశంసలు అందుకున్నారు. జగన్ తన తండ్రి వైయస్ మహిళా ఎమ్మెల్యే సబితమ్మను హోం మినిష్టర్ చేసినట్లే తాను కూడా రోజమ్మను హోం మినిష్టర్‌గా చేయాలని సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నాడని తెలుస్తోంది.


అయితే స్పీకర్‌గా రోజా పేరు పరిశీలనలో ఉన్నట్లు నిన్నటి వరకు ప్రచారంలో ఉంది..రోజమ్మా..స్పీకర్ పదవి ఇస్తున్నాను...ఏమంటావు అని జగన్ అడిగితే..నాకు ప్రజలతో కలిసి పని చేయాలని ఉంది..అయినా మీ ఇష్టం అన్నా..అంటూ ఇన్‌డైరెక్ట్‌గా మంత్రి పదవి కావాలని రోజా అడిగినట్లు సమాచారం. ఇక ఆర్కే రోజా జగన్‌కు నమ్మినబంటులా వ్యవహరించింది. జగన్ అన్న కోసం అసెంబ్లీలో టీడీపీ నేతల చేత పలు అవమానాలు ఎదుర్కోంది.  జగన్‌పై టీడీపీ నేతలు ఎటాక్ చేస్తే రోజా తన పదునైన మాటలతో వారిని చీల్చి చెండాడేది. జగన్‌ పై ఈగవాలనీయకపోయేది. టీడీపీ నేతలు అసెంబ్లీ రాకుండా ఏడాది బహిష్కరించినా వెరువక,  జగన్ అన్న గొంతుకగా తెలుగు తమ్ముళ్లను చెడుగుడు ఆడేది. విశ్వసనీయతకు పెద్ద పీట వేసే జగన్ రోజాకు తప్పక మంత్రి పదవి ఇస్తాడని వార్తలు వస్తున్నాయి.


అయితే చిత్తూరు నుంచి మొదటి నుంచి జగన్‌ని నమ్ముకుని ఉన్న సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వక తప్పని పరిస్థితి. అలాగే ఎస్సీ కోటాలో చిత్తూరు నుంచి మరో ఎమ్మెల్యేకు జగన్ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి కష్టమే అన్న వార్తలు వచ్చాయి. అయితే స్పీకర్‌గా శ్రీకాకుళం సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రోజాకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని..అదీ కీలకమైన హోం మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని రోజా అనుచరులు అంటున్నారు. నిజంగా జగన్ రోజాను హోం మినిష్టర్‌ను చేస్తే టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తుందనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: