టీమిండియా మాజీ సార‌థి మ‌హేంద్ర సింగ్ ధోనీపై పాక్ మంత్రి మండిప‌డ్డారు. ధోనీ ఇంగ్లండ్ వెళ్లి యుద్ధం ఏమీ చేయ‌లేదు క‌దా అంటూ వ్యాంగ్యంగా సెటైర్లు వేశారు.పాక్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫెడరల్‌ మంత్రి అయిన ఫవాద్‌ చౌదరి ధోనీపై చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. వివ‌రాల‌లోకి వెళితే...


ప్ర‌పంచ క‌ప్ మొద‌టి మ్యాచులో  టీమిండియా ద‌క్ష‌ణాఫ్రికాతో బోనీ కొట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచులో ధోనీ త‌న గ్లౌజుపై ఆర్మీకి సంబంధించిన ఓ లోగో ఇప్పుడు వార్త‌ల్లో నిలిచింది. బలిదాన్ బ్యాడ్జ్ ధోనీ కీపింగ్ గ్లౌజుపై ముద్రించుకుని త‌న దేశ భ‌క్తిని చాటుకున్నారు. అదేవిధంగా ఇండియ‌న్ ఆర్మీపై త‌న ఇష్టాన్ని చాటుకున్నారు. దీంతో భార‌త‌దేశం ధోనీపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంది. అయితే పాక్ మంత్రి ఫవాద్‌ చౌదరి మాత్రం ధోనీ చ‌ర్య‌ను త‌ప్పుబ‌డుతున్నారు. ధోనీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లార‌ని..యుద్ధం చేయ‌డానికి కాద‌న్నారు. అన‌వ‌స‌రంగా భార‌త మీడియా ఈ విష‌యంపై రాద్దాంతం చేస్తుందంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఈ మేర‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఐసీసీ కూడా ధోనీ గ్లౌజ్ పై ఉన్న బలిదాన్‌ బ్యాడ్జ్‌పై అభ్యంతరం తెలిపింది.  లోగోను తీయించాల్సిందిగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది.


అస‌లు బ‌లిదాన్ బ్యాడ్జ్ క‌థేంటి...పారామిలిటరీ కమాండోలు యుద్ధంలో చ‌నిపోతే వారికి గుర్తుగా ఈ బ‌లిదాన్  బ్యాడ్జ్ ధ‌రిస్తారు. రెండు క‌త్తులు ఉన్న ఈ బ్యాడ్జీ కేవ‌లం పారామిలిటరీ కమాండోలు మాత్ర‌మే ధ‌రించేందుకు అవ‌కాశం ఉంది. అయితే మ‌హేంద్ర సింగ్ ధోని 2011లోనే  లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా పొందారు. అందులో భాగంగా ధోనీ బ‌లిదాన్ బ్యాడ్జీ ధ‌రించ‌వ‌చ్చు. అయితే ఇప్పుడు ఇదే విష‌యంపై పాక్ అనుచిత వ్యాఖ్య‌ల‌కు పాల్ప‌డుతూ వారి నీచ‌పు వ‌క్ర‌బుద్ధిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: