వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న కేబినెట్లో ముగ్గురు నానిల‌కు చోటు ఇచ్చి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అయితే, ఆ ముగ్గురు నానిల క‌థేంటి?  వారికే జ‌గ‌న్ ఎందుకు ప‌ద‌వులు ఇచ్చారనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. ప్ర‌త్యేక‌త సాధించిన ఈ ముగ్గురు నానిల వివ‌రాలు ఇవి.


కొడాలి వెంకటేశ్వరరావు (నాని). ఫైర్ బ్రాండ్ నేత‌గా సుప‌రిచితుడు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనే హ్యాట్రిక్‌ రికార్డు నమోదు చేసిన ఆయన నాలుగోసారి విజయం సాధించి తనకు తిరుగులేదనిపించుకున్నారు. జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన నాని తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ తరపున గెలుపొందారు. తాజా ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేశారు. తొలిసారిగా జ‌గ‌న్ కేబినెట్లో నాని మంత్రి సీట్లో ఆసీనులు కానున్నారు. 


ఇక ఇదే కృష్ణా జిల్లాకు చెందిన మ‌రో నేత‌ పేర్ని వెంకట రామయ్య ( నాని). మచిలీపట్నం నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,590 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో 15 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన పేర్ని నాని..తాజా ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. జ‌గ‌న్ ప్రకటించిన న‌వ‌ర‌త్నాలు త‌న‌కు అనుకూలంగా మార‌తాయని ఆయన ప్రగాఢ నమ్మకంతో ఉండేవారు. తాజాగా అదే నిరూపితమైంది. సామాజికంగానూ  ఆర్థికంగానూ ఇద్దరు ప్రత్యర్థూలు బ‌లంగా ఉండ‌డం, ఇద్దరూ వివాదాల‌కు దూరంగా ఉండ‌డంతో పోటీ కూడా అదే స్థాయిలో జ‌రిగింది. చివ‌ర‌కు పేర్ని నాని మ‌రోసారి విజ‌యం సాధించారు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న్ను మంత్రి చేస్తున్నారు.


కీల‌క‌మైన గోదావ‌రి జిల్లాల్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆళ్లనాని వరుసగా మూడో సారి విజయం సాధించారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్ల నాని వరుసగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన సమీప ప్రత్యర్ధి, మరడాని రంగారావుపై 33,053 ఓట్ల మెజార్టీని సాధించారు. 2009 ఎన్నికల్లో ఆళ్ల సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం అభ్యర్థి బడేటి బుజ్జిపై 13,682 ఓట్ల మెజార్టీని సాధించారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీ చేశారు. మరోసారి బడేటి బుజ్జిపై పోటీ చేయగా..నాని ఓటమి పాలయ్యారు. బడేటి బుజ్జికి ఆ ఎన్నికల్లో 24780 ఓట్ల మెజార్టీ లభించింది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై ఆళ్ల నానికి  4072 ఓట్లు మెజార్టీ దక్కింది. అలా హ్యాట్రిక్ సొంతం చేసుకున్న ఆళ్ల నానికి జ‌గ‌న్  కేబినెట్ మంత్రి చాన్స్ క‌ల్పిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: