తెలంగాణలో మరుగున పడిపోతుందన్న కాంగ్రెస్ పార్టీ 2018 శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయంతో మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది అనుకున్నారు. ఇప్పుడు ఆ ఆశలు అడియాశలయ్యాయి. గతంలో ఇద్దరు పార్టీ మరగా ప్రస్తుతం ఏకంగా 12 మంది పార్టీ మారెందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుండా పోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. 12 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తానని ముఖ్యమంత్రి హామీనిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత క్యాబినెట్‌లో ఆరు ఖాళీలుండగా, విస్తరణ ఎపుడు జరిగినా.. విలీనమైన పన్నెండు మందిలో ఇద్దరికి కేబినెట్‌లో చోటు కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. 


విలీనానికి ముందు 12మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన విషయం విదితమే. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక గిరిజన రిజర్వుడు నియోజకవర్గానికి చెందిన రేగా కాంతారావు ఆదివాసీ ఎమ్మెల్యేలను ఏకం చేసి ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్ళారు. ఏజెన్సీ నియోజకవర్గాలలో పోడుభూముల సమస్య తీవ్రంగా ఉండగా, ఈ సమస్య ఉన్న నియోజకవర్గాలన్నింటిలో టీఆర్‌ఎస్‌ గత ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు చవిచూసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారానికి తన చిత్తశుద్ధిని ప్రకటిస్తూ.. గిరిజన నియోజకవర్గాల్లో తాను స్వయంగా కూర్చుని అక్కడికక్కడే పోడుభూముల పట్టాలు జారీ చేస్తానని, మళ్ళీ సమస్య రాకుండా చూస్తానని చెప్పారు. 


దాదాపు 20 నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉండగా, రేగా కాంతారావును పక్కనబెట్టుకుని ఈ సమస్య పరిష్కారం చేద్దామని సీఎం పలు సందర్భాల్లో అధికారుల సమక్షంలోనే చెప్పారు. టీఆర్‌ఎస్‌లో మొట్టమొదట చేరిన ఎమ్మెల్యే కూడా రేగాకాంతారావే. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కూడా ఒప్పించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతితో ఇద్దరు టీఆర్‌ఎస్‌కు జైకొట్టారు. ఆ తర్వాతే మిగతా ఎమ్మెల్యేలు క్యూకట్టడంతో విలీనం వరకు పరిస్థితి వచ్చింది. గిరిజన ప్రాంతంలో యువనాయకుడి అవసరం, రాజకీయంగా ఫలితాలు తీసుకొచ్చే చురుకైన నాయకుడు కావడంతో రేగాకాంతారావుకు భవిష్యత్తుపై సీఎం భరోసానిచ్చినట్లు తెలిసింది. పోడుభూముల సమస్య పరిష్కరిస్తే రిజర్వుడు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏకపక్షం అవుతుందని, అటు హార్డ్‌కోర్‌ స్థానాలు, ఇటు రిజర్వుడు స్థానాలతో 2023లోనూ అధికార పీఠాన్ని సునాయాసంగా దక్కించుకోవొచ్చుననే వ్యూహంతో ఉన్నట్లు చెబుతున్నారు. 


ఖమ్మం జిల్లాలో ఐదు గిరిజన రిజర్వుడు నియోజకవర్గాలుండగా, రేగా కాంతారావుకు పదవినివ్వడం ద్వారా ఈ ఐదింటితో పాటు పినపాక నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న ములుగు జిల్లాలోనూ ఏకపక్ష ఫలితాలు వస్తాయని ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. చరిత్రలో మొదటిసారి పినపాక నియోజకవర్గంలోని జిల్లా పరిషత్‌ ప్రాదేశిక స్థానాలు, మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను స్వీప్‌ చేశారు. రాజకీయ, సామాజిక కారణాల రీత్యా రేగాకు అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు. ఆయన సన్నిహితులు మాత్రం సీఎం తమ నేతకు భరోసానిచ్చాడని చెబుతున్నారు.


మహిళా కోటాలో రంగారెడ్డి జిల్లానుండి సబితా ఇంద్రారెడ్డి పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. 12మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ సభ్యులుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో, సిీఎం పదవులపై హామీనిచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరిపై చర్చ జరుగుతోంది. తనయుడు కార్తీక్‌రెడ్డిని వెంటబెట్టుకుని సీఎంను కలిసిన సందర్భంగా కూడా.. ఈ మేరకు హామీ లభించిందని, విలీనానికి ముందు కూడా సిీఎం ఈ దిశగా సంకేతాలిచ్చారని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. మిగతా ఎమ్మెల్యేలలో హరిప్రియానాయక్‌, పైలట్‌ రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌రెడ్డి, జాజుల సురేందర్‌ తొలిసారి గెలిచిన వారు కాగా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణికి జడ్పీఛైర్‌పర్సన్‌ ఛాన్స్‌ దక్కుతోంది. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లాపరిధిలోకే వస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: