ఏపీ రెండో ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏర్పాటు చేసుకున్న కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం పూర్త‌యింది. మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య‌కు అనుగుణంగా 26 మంది మంత్రుల‌కు సీఎంతో స‌హా అవ‌కాశం ఉండ‌డంతో జ‌గ‌న్ ఈ మొత్తానికి అవ‌కాశం క‌ల్పించారు. వీరిలో 25 మంది తాజాగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆది నుంచి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని నిరాడంబ‌రంగానే నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్‌.. తాజాగా మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని కూడా అత్యంత నిరాడంబ రంగానే నిర్వ‌హించారు. అతికి పోకుండా ప్ర‌తి రూపాయినీ జాగ్ర‌త్త‌గా వినియోగిచారు. 


సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, ప్రాంతీయ స‌మీక‌ర‌ణ‌లు అన్నింటినీ చూసుకుని జ‌గ‌న్ త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో మొత్తం పాతిక మంది కూర్పు కూడా పూర్త‌యింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స‌హా అన్ని వ‌ర్గాల‌కూ జ‌గ‌న్ స‌మాన ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటార‌ని చెప్ప‌డం ద్వారా పాల‌న ప్రాధాన్యాన్ని జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెప్పారు. ఇక‌, స‌చివాల‌యం ప‌క్క‌నే ఉన్న ఖాళీ ప్రాంతంలో నిర్వ‌హించిన ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రైన ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌తో ప్రాంగ‌ణం క‌ళ‌క‌ళ‌లాడింది. మొత్తంగా ప్ర‌మాణ స్వీకార ఉత్స‌వం ఆద్యంత్యం ప్ర‌శాంతంగా ముగిసింది. 


మంత్రులుగా ప్ర‌మాణం చేసిన వారిలో 22 మంది పూర్తిగా తెలుగులోనే చేసిన వారు ఉన్నారు. ఇక‌, కేవ‌లం ఇద్ద‌రు మాత్ర మే ఆంగ్లంలో ప్ర‌మాణం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నుంచి పోటీ చేసి వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకున్న మేక‌పాటి గౌతం రెడ్డి త‌న ప్ర‌మాణాన్ని ఆంగ్లంలో చేశారు. ఎంఎస్ టెక్స్‌టైల్స్ చేసిన ఆయ‌న విదేశాల్లో చ‌దువుకున్నారు. ఇక‌, ప్ర‌కాశం జిల్లా ఎర్ర‌గొండ పాలెం నుంచి విజ‌యం సాధించిన ఆదిమూల‌పు సురేష్ కూడా ఇంగ్లీష్‌లోనే ప్ర‌మాణ ప‌త్రాన్నిచ‌దివారు. ఐఆర్ ఎస్ ఉద్యోగం చేసిన ఆయ‌న పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రిజిల్లా ఆచంట నుంచి గెలిచిన చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు తెలుగులోనే ప్ర‌మాణ స్వీకారం చేసినా.. సార్వ‌భౌమాధికారం అనే వాక్యం ప‌ల‌క‌డంలో ఒకింత త‌డ‌బ‌డ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: