నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా హోం మంత్రిగా చరిత్ర సృష్టించారు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత. మంత్రి వర్గం ఏర్పాటులో సామాజిక సమతుల్యత పాటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ లో ఒక ఎస్సీ మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో 2009 లో  సబితా ఇంద్రారెడ్డికి హోంమంత్రి పదవి ఇవ్వగా... నేడు తండ్రి బాటలోనే జగన్ తన మంత్రి వర్గంలోనూ మహిళకు హోం మంత్రి పదవి కట్టబెట్టారు.

ఎవరీ సుచరిత ?
జగన్ మంత్రి వర్గంలో కీలక హోం మంత్రిగా  పదవి దక్కించుకున్న మేకతోటి సుచరిత  గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఫ్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ అభ్యర్ధి డొక్కా మాణిక్యవరప్రసాద్ పై 7,398 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. 1972 డిసెంబర్ 25న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జన్మించిన ఆమె 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత పొన్నూరులోని కేఎస్ జే కళాశాలలో ఇంటర్మీడియేట్ పూర్తి చేశారు. కరస్పాండెన్స్ ద్వారా డిగ్రీ, పీజీ పూర్తి చేశారు.ఆమె భర్త దయాసాగర్ ఐఆర్ఎస్   అధికారి. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

జెడ్పీటీసీగా మొదలై.... హోంమంత్రిగా ...
సుచరిత రాజకీయ జీవితం ఫిరంగిపురం నుంచే మొదలయ్యింది. 2006లో ఫిరంగిపురం జెడ్పీటీసీ గా కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీచేసి ఆమె గెలిచారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన అవకాశంతో తొలిసారి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి 2,500 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి జగన్ వెంట నడిచారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి 16వేల781 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి జగన్ వెంట నడుస్తూ  ప్రజా సమస్యలపై  పోరాడుతున్నారు.

2014లో  వైసీపీ టికెట్పై పోటీ చేసి రావెల కిశోర్బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019  లో జరిగిన ఎన్నికల్లో  వైసీపీ టికెట్ పొంది మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఓడించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటం, పార్టీని నమ్ముకుని జగన్ వెంట నడవటం, ఉన్నత విద్యావంతురాలు కావటంతో జగన్ కేబినెట్ లో ఎస్సీ మహిళా కోటాలో హోంమంత్రి పదవి దక్కించుకుని సుచరిత చరిత్ర సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: