తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌కందాయకంలో ప‌డ్డాయి.12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కారెక్క‌డమే గాకుండా..సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయ‌డంతో..ఇక పార్టీని బ‌తికించ‌డ‌మెలా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే చేజారుతుంటే పీసీసీ నాయ‌కులు ఏం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీని న‌డిపించే శ‌క్తి లేన‌ప్పుడు రాజీనామా చేయాల‌నే డిమాండ్లు పార్టీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతున్నాయి. ఇలాగైతే..2023లో ఏం ఖ‌ర్మ ఇంకో ప‌దేళ్ల‌యినా పార్టీ గెల‌వ‌ద‌నే ఆరోప‌ణ‌లు బ‌ల‌ప‌డుతున్నాయి.


పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీఎల్పీని విలీనం చేయ‌డంతో భ‌ట్టి విక్ర‌మార్క‌,ఉత్త‌మ్ కుమార్ రెడ్డి,శ్రీధ‌ర్ బాబు,ష‌బ్బీర్ అలీ వంటి వారంతా అగ్గి మీద గుగ్గిలం అవుతూ అసెంబ్లీ ముందు ధ‌ర్నాకు దిగి ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ సంగ‌తి తెలిసిందే.తాజాగా ఇవాళ ఇందిరాపార్క్ లోనూ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జాస్వామ్య ప‌రిరక్ష‌ణ పేరిట దీక్ష‌కు దిగారు. ఈ దీక్ష‌కు కోదండ‌రాం సైతం మ‌ద్ద‌తు తెలిపారు. సీఎల్పీ విలీనాన్ని ప్ర‌తీ ఒక్క‌రు ఖండించాల‌ని డిమాండ్ చేశారు.పార్టీల వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్‌లో లేనివారు విలీనం చేయాలని ఎలా సమావేశం పెడతారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను కలవడానికి స్పీకర్‌ ఎందుకు సమయం ఇవ్వడంలేదని మండిప‌డ్డారు.

ఇక‌పోతే.. పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ కుంతియా హాజ‌రై హాస్యాస్ప‌దంగా మాట్లాడ‌టం జ‌రిగింది.సీఎల్పీ విలీనంపై స్పీక‌ర్ ను త‌ప్పుబ‌ట్టిన కుంతియా… కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక‌టే రోజున పార్టీ మార‌లేద‌ని.. ఒక్కొక్క‌రు ఒక్కోసారి పార్టీని వీడార‌ని..అలాంట‌ప్పుడు విలీనం చేయ‌డం ఎలా కుదురుతుందంటూ మాట్లాడారు…


నిజమే..వాళ్లు ఒకేసారి పార్టీ మార‌లేదు.. ఒక్కొక్క‌రు ఒక్కో రోజున పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు..అయినా కానీ, మీరు వాళ్ల‌ను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయారే.. ఒక్క‌రు పార్టీని వీడ‌గానే ఎందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు.. అంటే.. ఒక్కొక్క‌రుగా అంద‌రూ పార్టీకి రాజీనామా చేశాక స్పందిద్దామ‌నుకున్నారా ఏంటి..? ఏం తెలివ‌య్యా మీది.. మీ తెలివి కార‌ణంగానే కాంగ్రెస్ పార్టీ సగం స‌చ్చింద‌ని కార్య‌క‌ర్త‌లు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ ప‌రిస్థితి ఇలా త‌యారవ్వ‌డానికి మొద‌టి కార‌ణం మీరే.. ఈ విష‌యం ప్ర‌తీ కాంగ్రెస్ కార్య‌క‌ర్త బ‌ల్ల‌గుద్ది చెప్తున్నారు..ఒక‌సారి కిందిస్థాయికి వెళ్లి ఆరా తీయండి..ఎప్పుడు చూసినా గాంధీ భ‌వ‌న్ లో కూర్చోని నాలుగు ముక్క‌లు మీడియాతో మాట్లాడి.. ఏదో సాధించిన‌ట్లు ఫీల‌వ్వ‌డం కాదు.. తెలంగాణ కాంగ్రెస్ లో ప్ర‌క్షాళ‌న చేయాల్సి వ‌స్తే ముందుగా మీ నుండే అది స్టార్ట్ కావాల‌ని ప్ర‌తీ కార్య‌క‌ర్త కోరుకుంటున్నారు..ఈ విష‌యాన్ని గుర్తించి జ‌ర జాగ్ర‌త్త‌గా మెసులుకోండి కుంతియా గారు అని హెచ్చ‌రిస్తున్నారు..

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వీహెచ్ ఈ దీక్ష వేదిక‌గా ఓ పాయింట్ లేవ‌నెత్తారు. కాంగ్రెస్ పార్టీ విలీనంపై అసెంబ్లీ ముందు ఉత్త‌మ్,భ‌ట్టి,శ్రీధ‌ర్ బాబులు ధ‌ర్నాకు దిగుతుంటే.. రేవంత్ రెడ్డి,కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎక్క‌డ‌పోయార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాళ్ల‌కు పార్టీక‌న్నా ముఖ్య‌మైన ప‌నులు ఏమున్నాయంటూ ప్ర‌శ్నించారు.

వీహెచ్ వ్యాఖ్య‌ల అనంత‌రం ధ‌ర్నాచౌక్ వ‌ద్ద దీనిపై ఓ పెద్ద చ‌ర్చే జ‌రిగింది. రేవంత్ రెడ్డి,కోమ‌టిరెడ్డిలు ఏకం కాబోతున్నార‌ని, త్వ‌ర‌లోనే వీరి ఆధ్వ‌ర్యంలో ఓ కొత్త పార్టీ పుట్ట‌బోతుంద‌ని, అందుకే వాళ్లు పార్టీతో అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపించాయి. పార్టీ రోజురోజుకీ బ‌ల‌హీన‌ప‌డుతున్నా.. అధిష్టానం మాత్రం చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని,ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో పార్టీ నిర్వీర్యమై పోయినా ఆయ‌న్ను మాత్రం ఎందుకు పీసీసీ నుంచి త‌ప్పించ‌డం లేద‌నే వాద‌న ఎప్ప‌టినుంచో జ‌రుగుతుంది.


ఎన్నిక‌ల‌కు ముందు ఓ ప‌క్క రేవంత్, మ‌రోప‌క్క కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పార్టీ త‌ర‌పున రాష్ట్ర‌మంతా పాద‌యాత్ర చేసి, పార్టీని గెలిపించుకుంటామ‌ని అధిష్టానంతో ఎన్నిసార్లు మొర‌పెట్టుకున్నా ప‌ట్టించుకోలేద‌ని, ఆఖ‌రికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగే బ‌స్సు యాత్ర‌కు అనుమ‌తులు ఇచ్చార‌ని, ఆ బ‌స్సు యాత్ర దారుణంగా ఫెయిలైంద‌ని, ఏ స‌భ‌లోనూ పెద్ద‌గా జ‌నాలు పాల్గొన‌లేద‌ని, పీసీసీ అధ్య‌క్షుడు పాల్గొన్న స‌భ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా విజ‌య‌వంతం కాలేద‌ని.. అక్క‌డి నుంచే పార్టీ ప‌త‌నం మొద‌లైంద‌ని, ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు మారుతున్నా చోద్యం చూస్తున్నార‌ని,ఇంకా ఎంత నష్టం జ‌రిగితే హైక‌మాండ్ స్పందిస్తుందో అనే ఆగ్ర‌హంతో రేవంత్,కోమ‌టిరెడ్డిలు ఉన్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకోవ‌డం జ‌రిగింది.

ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రూ ఏక‌మై స్వంతంగా పార్టీ నెల‌కొల్పాల‌నే ఉద్ధేశ్యానికి వ‌చ్చార‌న్న గుస‌గుస‌లు వినిపించ‌డంతో ఇప్పుడీ చ‌ర్చ తెలంగాణ‌లో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: