తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ బీసీల పార్టీగా ముద్ర‌ప‌డింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు బీసీలు అన్ని రంగాల్లో వెన‌క‌ప‌డి ఉన్నార‌ని భావించి వారికి రాజ‌కీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. బీసీల‌కు విద్యా, ఉద్యోగ అవ‌కాశాల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు. దీని ద్వారా ఎంతో మంది బీసీలు రాజ‌కీయంగా కీల‌క స్థానాల‌కు చేరుకున్నారు. ఓ విధంగా ఈ రోజు బీసీలు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఈ రేంజులో ఉన్నారంటే ఎన్టీఆర్ రిజ‌ర్వేష‌న్లే ప్ర‌ధాన కార‌ణం.


ఆ త‌ర్వాత వారిని రాజ‌కీయంగా కూడా ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స్థానిక సంస్థ‌ల్లోనూ బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు. దీంతో బీసీల‌కు తిరుగులేకుండా పోయింది. బీసీలు అంటే తెలుగుదేశం... తెలుగుదేశం అంటే బీసీలు అన్న‌ట్టుగా మారిపోయింది. ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా బీసీలు మాత్రం ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉంటూ వ‌చ్చారు. చంద్ర‌బాబు రెండోసారి 1999లో సీఎంగా గెలిచినా, ఆ త‌ర్వాత పార్టీ నిల‌బ‌డినా చివ‌ర‌కు 2014లో ఆయ‌న న‌వ్యాంధ్ర సీఎం అయినా బీసీల ఓట్లే వెన్నుముక‌గా ఉన్నాయి.


2014లో గెలిచాక చంద్ర‌బాబు బీసీల‌ను పూర్తిగా విస్మ‌రించారు. కేఈ.కృష్ణ‌మూర్తి లాంటి వాళ్ల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ఇచ్చినా ఆయ‌న శాఖ‌ల్లోనే ఆయ‌న‌కు ప్రాధాన్య‌త లేకుండా చేశారు. ఐదేళ్ల పాటు కాపులు కాపులు అంటూ వారి నామ‌స్మ‌ర‌ణ చేసిన బాబు బీసీలకు స‌రైన ప్ర‌యార్టీ ఇవ్వ‌లేద‌న్న భావ‌న‌కు వారు వ‌చ్చేశారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌ని బాబు చెప్ప‌డం.. అదే టైంలో జ‌గ‌న్ మాత్రం అది త‌న ప‌రిధిలో లేద‌ని చెప్ప‌డం, ఇక ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు బీసీల‌ను గుర్తించ‌ని బాబు చివ‌ర్లో ప్ర‌తి బీసీ కులానికి ఒక కార్పొరేష‌న్ పెట్టేసి మ‌మ అనిపించేయ‌డం కూడా వారికి న‌చ్చ‌లేదు.


అదే టైంలో బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో జ‌గ‌న్ ముందు నుంచి ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం కూడా ఈ సారి బీసీల్లో మార్పున‌కు కార‌ణ‌మైంది. అదే టైంలో జ‌గ‌న్ ఈ సారి రికార్డు స్థాయిలో బీసీల‌కు సీట్లు ఇచ్చారు. సీమ‌లో మూడు ఎంపీ సీట్లు బీసీల‌కు ఇవ్వ‌డం.. వారు ముగ్గురు గెల‌వ‌డం రికార్డు. ఇక ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ఎంపీ సీట్లే కాకుండా కీల‌క‌మైన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ సీటును సైతం బీసీల్లో బ‌ల‌మైన గౌడ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మార్గాని భ‌ర‌త్‌కు ఇవ్వ‌డంతో ఈ సారి బీసీలు వ‌న్‌సైడ్‌కే వైసీపీకే జైకొట్టేశారు.


ఈ క్ర‌మంలోనే వైసీపీ, టీడీపీ మ‌ధ్య ఓట్ల శాతంలో ఏకంగా 10 వ‌ర‌కు తేడా వ‌చ్చింది. కీల‌క‌మైన చిల‌కలూరిపేట లాంటి చోట్ల బీసీ మ‌హిళ‌ల‌ను రంగంలోకి దించి మ‌రీ స‌క్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు కేబినెట్‌లో ఏకంగా ఏడుగురు బీసీ మంత్రులు, మైనార్టీ మంత్రి కూడా బీసీ-ఈ కోటాలో మంత్రి అయ్యారు. ఈ లెక్క‌న ఎనిమిది మంత్రుల‌కు చోటు ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఈ ప‌రిణామాలు అన్ని బీసీల్లో చాలా చేంజ్ రాగా... వాళ్ల‌లో మెజార్టీ వ‌ర్గాలు టీడీపీని వ‌దిలేసి.. జ‌గ‌న్‌కు జై కొడుతున్న ప‌రిణామాలే క‌నిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: