కాంగ్రెస్ పార్టీ ప‌రువు గంగ‌లో క‌లిసిపోయింది. కాదు కాదు గంగ‌లో క‌లిపేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో పొత్తు వ‌ద్దో..మొర్రో అని ఎంత మొత్తుకున్నా జాతీయ ప్ర‌యోజ‌నాల కోసమంటూ పార్టీని నాశ‌నం చేశారు. టీఆర్ఎస్ స‌ర్కార్ పై ఉన్న కొద్దో గొప్ప వ్య‌తిరేక‌త‌ను కూడా కాపాడుకోలేక‌పోయారు. ఇక సీట్ల పంప‌కాల విష‌యంలో నాన్చి నాన్చి పార్టీలో క‌ష్ట‌ప‌డ్డ నేత‌ల‌కు కాకుండా..పైర‌వీల‌కు పెద్ద‌పీట వేశారు.మ‌రోవైపు.. నేత‌లంతా ఒక్క‌తాటిపై న‌డ‌వ‌కుండా ఎవ‌రి దారిలో వారు న‌డిచి న‌ట్టేట ముంచారు. పార్టీ గెలిచే ప‌నిచేయండ్రా అంటే..ఒక‌రిపై మ‌రొక‌రు కుట్ర‌లు చేసుకుంటూ ఎవ‌రి ఇంటికి వాళ్లే నిప్పు అంటించుకున్నారు. ఇక ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేసేందుకు కనీసం ఒక్క స్టార్ క్యాంపెయిన‌ర్ ను కూడా దింప‌లేక‌పోయారు.ఆఖ‌రికి అట్నో ఇట్నో హ‌స్తం గుర్తుపై గెలిచిన 19 మందిని కూడా కాపాడుకోలేక.. అప్పనంగా డ‌జ‌ను మందిని అధికార పార్టీకి అప్ప‌గించారు. పోను పోను పార్టీలో మిగిలిన ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఉంటారో లేదో గ్యారెంటీ లేదు. ఈ ఆరుగురిలోనూ ఇద్ద‌రు టీఆర్ఎస్ తో ట‌చ్ లో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.ఇక ఆ ఇద్ద‌రు కూడా పోతే.. మిగిలే న‌లుగురిలో ఏ ఒక్క‌రికీ స‌ఖ్య‌త లేదు.వారంతా పీసీసీ పీసీసీ అంటూ క‌ల‌వ‌రిస్తున్న వారే. ఇక పీసీసీ ప‌గ్గాలు రావ‌ని తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే మిగ‌తా వాళ్లు కూడా కారెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది..


రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితిని చూస్తుంటే పెద్ద‌గా బాధ అనిపించ‌డం లేదు.కానీ, కాంగ్రెస్ గెలుపు కోసం తిండి తిప్ప‌లు మాని,నిద్రాహారాలు కూడా లేకుండా క‌ష్ట‌ప‌డ్డ కార్య‌క‌ర్త‌ల‌ను చూస్తుంటేనే నిజంగా జాలేస్తుంది. మా ఊళ్లో కాంగ్రెస్ గెల‌వాలి,మా మండ‌లంలో కాంగ్రెస్ నిల‌వాలి,మా నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ జెండా ఎగ‌రాలి, మా జిల్లా కాంగ్రెస్ కంచుకోట‌గా ఉండాల‌ని నిద్ర‌లోనూ క‌ల‌వ‌రించే కార్య‌క‌ర్త‌లు ఒక‌ప్పుడు కోట్ల‌లో ఉండేవాళ్లు. కానీ, పార్టీ నాయ‌క‌త్వం అవ‌లంభిస్తున్న తీరును చూసి..అవ‌మానాలు భ‌రించ‌లేక,కాంగ్రెస్ జెండా మోసీ మోసీ అలసిపోయి.. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కంట‌నీరు కారుస్తూ..హ‌స్తాన్ని వీడుతూ కారెక్కుతున్నారు. అయినా.. కార్య‌క‌ర్త‌ల‌కు గుండె నిబ్బ‌రం చేసుకోండ‌ని చెప్పే నాయ‌కుడే లేడాయే. పార్టీని వీడ‌కండి..మ‌న‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంది.. ఖ‌చ్చితంగా రాబోయేది మ‌న ప్ర‌భుత్వ‌మే.. ఈసారి కాక‌పోతే మరోసారి.. అప్ప‌టిదాకా ఎత్తిన జెండా దించ‌కండ‌ని చెప్పే నాయ‌కుడు తెలంగాణ కాంగ్రెస్ లో వెతికినా కనిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌ముందు నేను సీఎం అభ్య‌ర్థినంటే నేను సీఎం అభ్య‌ర్థినంటూ జోర్దార్ ప్ర‌క‌టన‌లిచ్చుకున్న వాళ్లు ఇప్పుడు భూత‌ద్ధం పెట్టి వెతికినా అగుపించ‌డం లేదు.


ఇప్ప‌టికైనా వ‌చ్చిన న‌ష్టం లేదు. ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో గులాబీ హ‌వా న‌డిచినా అది ఎప్పటికీ శాశ్వ‌తం కాదు. ఖ‌చ్చితంగా ఏదో ఒక రోజు వ్య‌తిరేక‌త రావాల్సిందే.. ప్ర‌భుత్వం మారాల్సిందే. కాబ‌ట్టి, పార్టీలో మిగిలి ఉన్న నాయ‌కులంతా స్వార్థాల‌ను ప‌క్క‌న‌పెట్టి.. పార్టీని ప్ర‌క్షాళ‌న చేసే విధంగా న‌డుం బిగించ‌డం బెట‌ర్.. లేదంటే తెలంగాణ‌లో ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేద‌ని చ‌రిత్ర‌లో రాసుకోవాల్సి వ‌స్తుంది…


మరింత సమాచారం తెలుసుకోండి: