సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్​ విచ్చేస్తున్నారు. నేడు తిరుమలలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రధానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలకనున్నారు.సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు మోదీ. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. సాయంత్రం 6.00 గంటల నుంచి 7.15 నిమిషాల వరకు ప్రధాని ఆలయంలో గడపనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ బయల్దేరుతారు. ప్రధాని హోదాలో మోదీ మూడోసారి తిరుమలకు వస్తున్నారు. 


కొలంబో పర్యటనలో ఉన్న మోదీ, అక్కడి నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఆ తర్వాత 4.40 నుంచి 5.10 వరకు ఏపీ సీఎం జగన్, సహా ముఖ్యనేతలతో మోదీ అనధికారికంగా భేటీ అవుతారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన తిరుమలలో పద్మావతి అతిథి గృహానికి మోదీ చేరుకుంటారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు. గ్రేహౌండ్స్, స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. ఆక్టోపస్ బలగాలు ఆయుధాలతో తిరుమలలోని మాడవీధుల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆలయానికి సమీపంలో ఉన్న సైకిల్ స్టాండ్స్, టీ స్టాల్స్, షాపుల దగ్గర కూడా తనిఖీలు చేస్తున్నారు. కేంద్ర ఇంటెలిచెన్స్ హెచ్చరికలత నేపథ్యంలో ప్రధాని భద్రతను పర్యవేక్షించే SPG బృందాలు తిరుమలలో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.


ప్రధాని తిరుపతి, తిరుమల పర్యటన సందర్భంగా.. తిరుపతి ఎయిర్‌పోర్ట్ సమీపంలోనే ఏపీ బీజేపీ నేతలు ఓ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభాస్థలాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు శనివారం పరిశీలించారు. ఆదివారం సాయంత్రం విమానాశ్రయం రహదారి కార్బన్‌ సెల్‌ఫోన్‌ కంపెనీ మైదానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 5 వేల మంది కూర్చునేలా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. షెడ్డుకు ముందు భాగంలో ప్రధాన మంత్రి పాల్గొనే వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, భానుప్రకాష్‌రెడ్డి తదితర నేతలు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, జేసీ గిరీషా, వివిధ శాఖల ఉన్నతాధికారులు సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లు పక్కాగా ఉండాలలినన కిందస్థాయి అధికారులకు సూచించారు. నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా విజయోత్సవ సభని ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: