అనంతపురంలో టీడీపీ ఘోర ఓటమి ఇంకా ఆ జిల్లా నేతలను, తెలుగు తమ్ముళ్లను తేరుకోనీయకుండా చేసింది. మిగతా రాష్ట్రంతా ఓడిపోవం ఒక ఎత్తు అయితే ఈసారి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓడటం మరోఎత్తు. ఇంత వరకూ తెలుగుదేశం పార్టీ ఎన్నో ఓటములు చూసింది. వైఎస్‌ గాలిలో చిత్తు అయ్యింది. అయితే అప్పుడు కూడా అనంతపురం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ పరువు నిలుపుకుంది!


కనీసం ఐదారు అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పార్టీ ప్రతిసారీ కచ్చితంగా విజయం సాధిస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఓడిన 2004, 2009 సార్వత్రిక ఎన్నికలప్పుడు కూడా అనంతపురంలో మాత్రం కనీసం ఆరు అసెంబ్లీ సీట్లు ఆ పార్టీకి దక్కాయి. అయితే ఈసారి అక్కడ దక్కిన అసెంబ్లీ సీట్లు రెండు! వాటిల్లో ఒకటి స్వల్ప మెజారిటీతో, రెండోది వైఎస్సార్సీపీ ప్రయత్న లోపం ద్వారా దక్కింది. ఈ ఎన్నికలు అలా తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకు పీడకలగా మిగిలాయి.


అందులోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీలను గమనిస్తే వారు మరింత కలవరానికి గురి అవుతున్నారు. ముప్పైవేలు, నలభైవేలు మెజారిటీలు అనంతపురం జిల్లా చరిత్రలోనే లేవు. తెలుగుదేశం నెగ్గినా నాలుగైదు వేల మెజారిటీలే. అలాంటి చోట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు సాధించిన మెజారిటీలను చూసి.. తెలుగుదేశం పార్టీకి భవితవ్యం ఉందా? అనేది వారు మదనపడుతూ ఉన్నాడు. ఇదే సమయంలో ఆ జిల్లాలోని నేతలు బీజేపీ వైపు చూస్తూ ఉండటం టీడీపీ కార్యకర్తలనూ, అభిమానులను ఆందోళనలోకి నెడుతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: