రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌నుమ‌రుగు అయిన కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరించి ఇటీవలి ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు జ‌న‌సేన పార్టీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆస‌క్తిక‌ర రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. జ‌న‌సేన పార్టీకి నాదెండ్ల మ‌నోహ‌ర్ గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. దీనికి మ‌ద్ద‌తుగా కొన్ని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డంతో....అదే నిజ‌మ‌నుకున్నారు. అయితే, దీనిపై మ‌నోహ‌ర్ క్లారిటీ ఇచ్చారు.


సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్... ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ‌రోవైపు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఘోర ప‌రాజ‌యంపై జనసేనాని పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా సమీక్ష నిర్వహించగా ఆ సమావేశానికి నాదెండ్ల మనోహర్ హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది. మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేసిన మ‌రుస‌టి రోజే ఈ ప్ర‌చారం జ‌ర‌గ‌డం పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న‌ను రేకెత్తించింది. 


అయితే, పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారంపై నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. తాను జనసేన పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన ఆయన... నేను పార్టీ వీడుతా అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. విదేశాల్లో ఉండటం వల్ల పార్టీ సమీక్షల్లో పాల్గొనలేక పోయానని.. వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఓ ప్రకటన విడుదల చేశారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా నాదెండ్ల మనోహర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయన పార్టీని వీడే ప్రసక్తి లేదని జనసేన పార్టీ పేర్కొంది. ఏది ఏమైనా నాదెండ్ల మనోహర్ తాజా వార్త‌ల‌తో జ‌న‌సేన సైనికుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేశార‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: