అన్నదమ్ముల్లో అన్నే కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఆయన్నే మంత్రిగా చేసి కీలకమైన రోడ్లు భవనాల శాఖను కట్టబెట్టారు. అయితే శ్రీకాకుళంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి వినిపించిన మాట ఒకటే. మళ్ళీ ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని. ఆయన మళ్ళీ రెవిన్యూ మంత్రిగా వస్తారని కూడా ప్రచారం  జరిగింది. దాంతో గత పదిహేను రోజులుగా రెవిన్యూ అధికారులతో, ప్రభుత్వ అధికారులతో ధర్మాన నివాసం సందడిగా మారింది. అయితే ఇపుడు మొత్తం సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా అన్న ధర్మాన క్రిష్ణదాస్ కి మంత్రి యోగం పట్టేసింది. దాంతో రాజకీయ జీవిత చరమాంకంలో ప్రసాదరావుకు తీరని నిరాశ ఎదురైందని అంటున్నారు.


ధర్మాన ప్రసాదరావు మీద మొదటి నుంచి జగన్ కి కొంత సందేహం ఉందన్న మాట పార్టీలో వినిపిస్తోంది. అన్న క్రిష్ణదాస్ ని నమ్మినంతగా ప్రసాదరావుని జగన్ నమ్మరని అంటారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉంటూ చివర్లో విభజన తరువాత  అనివార్యంగా  వైసీపీలో చేరిన ప్రసాదరావు గత ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. అంతకు ముందు కాంగ్రెస్ మంత్రిగా ఆయన జగన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించడమే  కాకుడా, పదునైన విమర్శలు కూడా చేసేవారు. ఇక గత అయిదేళ్ళలో ఆయన జిల్లాలో పార్టీ పటిష్టతకు పెద్దగా శ్రధ్ధ చూపలేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఓ దశలో టికెట్ కూడా రాదన్న మాట కూడా వినిపించింది.


ఇక తాజా ఎన్నికల్లో ఆయన క్రాస్ ఓటింగునకు పాల్పడి వైసీపీ ఎంపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ ఓటమికి కారణమయ్యారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కాళింగ సామాజికవర్గానికి చెందిన దువ్వాడ శ్రీను ఇతరనాయకులు జగన్ కి ఈ మేరకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం ప్రసాదరావు అవకాశాలను పూర్తిగా తగ్గించేశిందని అంటున్నారు. తాజా ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు ఇదే తన చివరి ఎన్నికల పోరాటమని చెప్పుకున్నారు. ఓటర్లను కూడా ఆయన అలాగే ఓట్ల  కోసం అభ్యర్ధించారు. ఈసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రిగా పనిచేసి ఆ సంత్రుప్తితో రాజకీయ విరమణ చేయాలని ఆయన భావించారు.


అయితే దానికి భిన్నంగా ఆయన్ని కేవలం ఎమ్మెల్యేగానే చేసి కూర్చోబెట్టడం పట్ల ఆయన వర్గీయుల్లో అసంత్రుప్తి వ్యక్తం అవుతోంది. ధర్మాన కుటుంబంలోనే మంత్రి పదవి ఉన్నా ప్రసాదరావు కు వచ్చి ఉంటే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది. అయితే ధర్మాన కుటుంబానికే మంత్రి పదవి ఇవ్వదలిస్తే క్రిష్ణదాస్ కే ఇవ్వాలని కాళింగ సామాజికవర్గం నేతలతో సహా అంతా ఒక్క మాట మీద నిలబడి చెప్పడంతోనే జగన్ ప్రసాదరావుని పక్కన పెట్టేసారని అంటున్నారు. మొత్తానికి ఈ సీనియర్ నేత కధ ఇపుడు ఇలా ముగిసిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: