విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడానికి కారణాలలో ముఖ్యమైనది ఇద్దరు మాజీ మంత్రుల  మధ్య రచ్చకెక్కిన విభేదాలు. ఇది కార్యకర్తలే బాహాటంగా చెబుతారు. అటు గంటా శ్రీనివాసరావు, ఇటు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇద్దరూ కూడా చంద్రబాబు మాటని సైతం ధిక్కరించి బస్తీ మే సవాల్ అన్నారు. అప్పట్లో  ఏనాడు ఒకే వేదిక మీద ఇద్దరూ వచ్చిన దాఖలాలు లేవు. తామే  పెత్తందారులమని బడాయి పోయిన ఈ పెద్దన్నల వల్ల పార్టీ పడకేసింది.



ఎన్నికలు ఎపుడు వచ్చినా విశాఖలో ఘోరమైన ఫలితాలు వస్తాయని ఆనాడే  అంతా వూహించారు. అయితే మరీ ఇంత నాసిరకం ఫలితాలు వస్తాయని మాజీ మంత్రులు కూడా అనుకోలేదు. వాటిని చూసి ఇద్దరూ ఇపుడు ఖంగు తిన్నారు. ఇక పార్టీ చరిత్రలో ఏనాడు ఓడనంతగా పరాజయం పాలైంది. క్యాడర్ పూర్తిగా షాక్ లోకి వెళ్ళిపోయింది. అయినా ఇద్దరు మాజీలు కలసి ధైర్యం చెప్పే వాతారణం ఉందా అంటే అది అత్యాశేనని తేల్చేశారు. ఓటమి తరువాత తొలిసారి నిర్వహించిన పార్టీ సమావేశానికి సీనియర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వచ్చారు.


ఆయనే క్యాడర్ కి  నేనున్నానని దిశానిర్దేశం చేశారు. మరో మాజీ మంత్రి గంట శ్రీనివాస‌రావు జాడ మాత్రం లేదు. ఆయన అయ్యన్న పొడగిట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని అయ్యన్న వర్గం గరం గరం అవుతోంది. ప్రజలు ఓటమికి కానుకగా ఇచ్చినా ఈ విభేదాలు మాత్రం పోలేదని తమ్ముళ్ళు అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో అయ్యన్న స్వయంగా ఓటమి పాలు అయ్యారు. మరో మాజీ మంత్రి గంటా చావు తప్పి కన్ను లొట్టగా స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇపుడు అయ్యన్న  ఓడారని గంటా వర్గం సంబరపడుతూంటే  గంటా గెలుపు అదేనా అంటూ అయ్యన్న వర్గం  అంటోందట. 


మొత్తానికి అధికార పార్టీలో ఉంటూ పదవులు తీసుకునే గంటా ఈసారి మాజీగా మిగిలిపోవడం రెండవ వర్గానికి ఆనందంగా ఉండగా, ఇక సీనియర్ నేత రాజకీయ జీవితానికి చెక్ పడిపోయిందని గంటా బ్యాచ్ ఖుషీ అవుతున్నట్లుంది. మరి దగ్గరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. అవైనా సజావుగా నాయకత్వం వహించి మంచి ఫలితాలు సాధిస్తారా అంటే లేదనే మాట వస్తోంది. ఓడినా కూడా తగ్గని ఆధిపత్య పోరు, గ్రూప్ రాజకీయాల వల్ల జీవీఎంసీ పదవి చేజారుతుందా అన్న అనుమానాలు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: