సమస్య ఏమిటంటే కొంతమంది తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. తమ స్ధాయి ఏమిటో పక్క వాళ్ళు చెప్పరు. చెప్పినా వీళ్ళు వినరు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించే ఇదంతా. తనను తాను పవన్ చాలా ఎక్కువగా ఊహించేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే చాలు జనాలు వద్దన్నా వచ్చి ఓట్లేసేస్తారని అంచనా వేసుకున్నారు. తన సోదరుడు చిరంజీవి పార్టీ పెడితే ఏమైందనే విషయాన్ని మరచిపోయారు. దాంతో ఘోర పరాభవం తప్పలేదు.

 

మూడు రోజుల నుండి నేతలతో సమీక్షలు చేస్తున్న పవన్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ తన ఆశయాలే చూశారని ఇప్పటి నుండి దెబ్బకు దెబ్బ తీస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు. అంటే పవన్ ఆశయాలేంటో ఎవరికీ తెలీదు. పవన్ ఆశయాలను జనాలు చూసిందీ లేదు. కాబట్టి ఇక నుండి దెబ్బకు దెబ్బ తీస్తానంటూ హెచ్చరికలేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలని చంద్రబాబు అనుకుంటే అర్ధముంది. 2014లోనే 67 సీట్లు గెలుచుకున్నారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటంలో తప్పులేదు. మరి పవన్ దగ్గర ఏముందని జనాలు ఓట్లేస్తారు ? రెండు రోజులు గట్టిగా యాత్ర చేస్తే పది రోజులు అడ్రస్ కూడా కనబడరు మళ్ళీ. పైగా పీకల దాకా జనాల్లో  కసి పేరుకుపోయిన చంద్రబాబుతోనే వెళ్ళి కలిశారు. నికార్సయిన రాజకీయం చేద్దామనుకున్న వ్యక్తి వ్యతిరేకించాల్సింది ప్రతిపక్షంలో ఉన్న జగన్ కాదు చంద్రబాబును.

 

ఇంతచిన్న లాజిక్ మిస్సయిన కారణంగానే పవన్ ను జనాలు నమ్మలేదు. చంద్రబాబు, తాను ఒకటే అని పవన్ తన మాటలు, చేష్టల ద్వారా నిరూపించుకున్నారు. దాంతో జనాలు జనసేనకు బాగా గుండుకొట్టి మూల కూర్చోబెట్టారు. తనలోని తప్పులను సమీక్షించుకోవటం మానేసి దెబ్బకు దెబ్బ తీస్తానని రంకెలేయటంలొ ఏమీ ఉపయోగం లేదని గ్రహించాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే జగన్ లాగ జనాల్లోనే ఉండాలి కానీ ఎక్కడో ఫాం హౌస్ రాజకీయాలు చేస్తానంటే జనాలు నమ్మరు.

 

రెండోసారి ముఖ్యమంత్రవ్వటానికి చంద్రబాబు ఎంత కష్టపడ్డారో అందరూ చూసిందే. ముఖ్యమంత్రిగా కాకుండా పార్టీ అధ్యక్షునిగా నానా అవస్తలు పడ్డారు. పార్టీని అధికారంలోకి తేవటం కోసం జగన్ పడిన కష్టం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వీళ్ళద్దరి కష్టాన్ని చూసిన తర్వాత అధికారంలోకి రావటం కోసం పవన్ పడిన కష్టమేంటో అందరూ గమనించారు. అందుకే 120 చోట్ల డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. జనాల మనసులను గెలుచుకోవటం మానేసి సినిమా డైలాగులు చెబితే ఇక్కడ చెల్లుబాటు కావని ఇంకా పవన్ గ్రహించక పోవటమే విచిత్రంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: