చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాల్లో  అతిపెద్దది విశాఖ భూముల కుంభకోణం. టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని యధేచ్ఛగా విశాఖ ముదపాక భూములను కబ్జాలు చేసి ఆక్రమించుకున్నారని అప్పట్లో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. క‌లెక్ట‌ర్ లెక్క‌ల ప్ర‌కార‌మే జిల్లాలో 10,000 ఎక‌రాల‌కు పైగా భూమి లెక్క‌లు తారుమార‌య్యాయి. అంటే దాదాపు 25,000 కోట్ల విలువ చేసే భూమి మాయం అయిపోయింద‌న్న‌మాట‌. అసలు విశాఖ జిల్లాలో ఉన్న 3022 గ్రామాల్లో 2ల‌క్ష‌ల ఎఫ్.ఎం.బి స‌ర్వే నెంబ‌ర్ల‌లో 16,000 నెంబ‌ర్లు గ‌ల్లంత‌య్యాయి. దీనిలో సుమారు ల‌క్ష ఎక‌రాల భూమి అన్యాక్రాంతం అయిన‌ట్టు చ‌ర్చ జ‌రిగింది. కానీ ప్ర‌భుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని 10,000 ఎక‌రాలుగా మాత్ర‌మే చిత్రించే ప్ర‌య‌త్నం చేసారు. నాడు విశాఖ భూకుంభకోణం వెనుక  తోటి కేబినెట్ మంత్రి గంటా ఆయన అనుచరులు, అమరావతి పెద్దల హస్తం ఉందని  స్వయంగా  టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. దీంతో విశాఖ భూకుంభకోణం తీవ్ర వివాదస్పదంగా మారింది. 


విశాఖ భూ కుంభకోణంలో ఉన్నది టిడిపి నేతలేనని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ముదపాకలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భారీగా అసైన్డ్‌ భూములను కొట్టేసే ప్లాన్‌ చేశారంటూ వైసీపీ సేవ్ విశాఖ పేరుతో నిర్వహించిన మహాధర్నాలో నాటి ప్రతిపక్షనాయకుడిగా వైయస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖలో భూదందా జరుగుతోందని ముందునుంచే చెప్పారని, జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గరుండి భూములన్నింటినీ కబ్జా చేయించారని, ఆయన బంధువు భాస్కరరావు తనకు సంబంధం లేని భూములను తన పేరిట రిజిస్టర్‌ చేసుకొని పేదల కాలనీలో భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి లోన్లు తీసుకున్నారని నాడు వైయస్ జగన్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రభుత్వాధికారులే సహకరిస్తున్నారని ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. గంటాకు ఇంత నారా లోకేశ్‌కు ఇంత అని డబ్బులు పంచుకుంటున్నారని నాడు వైయస్ జగన్ ధ్వజమెత్తారు. 


అయితే అప్పటి చంద్రబాబు సర్కార్ విశాఖ భూకుంభకోణం కేసును పక్కన పెట్టింది.  ప్రతిపక్ష హోదాలో వైసిపి నాడు ఎంతో పోరాటం చేసినప్పటికీ నాడు అధికార పార్టీగా ఉన్న టిడిపి ఈ వ్యవహారంపై ఏమాత్రం స్పందించలేదు.  గంటా శ్రీనివాసరావు వర్గంగా ఉన్న భీమిలి కి చెందిన నేతలే పెద్ద ఎత్తున అక్రమ భూ సేకరణ చేశారని, అందుకే ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని అప్పట్లో పెద్దఎత్తున చర్చ సాగింది. టీడీపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు, అన‌కాల‌ప‌ల్ల ఎమ్మెల్యే పీలా గోవింద స‌త్య‌నారాయ‌ణ‌, పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి, య‌ల‌మంచిలి ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు,  విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబులతో పాటు పలువురు  రెవెన్యూ అధికారులు పై ఆరోపణలు వచ్చాయి. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన  సిట్‌  ప్రజలు ఇచ్చిన  2,875 ఫిర్యాదుల్లో కేవలం 336 ఫిర్యాదులపై నామమాత్రపు విచారణ జరిపించి, సాక్ష్యాలను తప్పుదోవ పట్టించి గంటాకు, ఇతర టీడీపీ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో సిట్ నివేదికపై ప్రజలతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు  తీవ్ర అభ్యంతరం చెప్పారు. నాడు చంద్రబాబు, లోకేష్‌ల ఒత్తిళ్ల మేరకు విశాఖ ల్యాండ్ స్కామ్ కేసు మూలనపడింది.


తాజాగా  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ బాబు హయాంలో జరిగిన భూకుంభకోణాలు అన్నింటిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. తాజాగా అమరావతి ల్యాండ్ స్కామ్‌తో పాటు, విశాఖ భూకుంభకోణంలో దోషులు ఎవరో తేల్చాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అవినీతికి పాల్పడిన వారు, అక్రమ భూ దందాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు విశాఖ భూకుంభకోణంపై తిరిగి విచారణ జరిపించేందుకు సిద్ధం అవుతున్నారు.  విశాఖ భూ కుంభకోణ పాత్రధారులు, సూత్రధారులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం తప్పదని తాజాగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలుస్తోంది. దీంతో గంటా శ్రీనివాసరావులోనూ, ఆయన అనుచరవర్గంలోనూ భయాందోళన పట్టుకుంది.  త్వరలోనే విశాఖ భూకుంభకోణంలో మాజీమంత్రి గంటా శ్రీనివాస్‌రావుతో పాటు ఆయన అనుచరులు విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు జైలుకుపోక తప్పదని విశాఖ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ కేసులో పూర్తిగా విచారణ జరిగితే గంటాతో పాటు, లోకేష్‌ బాగోతం కూడా బయటపడుతుందని అధికారులు అంటున్నారు. 40 ఏళ్లు అనుభవం ఉన్న చంద్రబాబు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారితే..40 ఏళ్ల యువకుడు అవినీతిపరులకు సింహస్వప్నంగా మారారని ప్రజలు అంటున్నారు. మొత్తానికి విశాఖ కుంభకోణంలో మాజీ మంత్రి గంటా జైలుకు పోవడం ఖాయమని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: