ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇపుడు ఏ విధంగా చూసినా పరిస్థితి అనుకూలంగా లేదన్నది వాస్తవం. కనీసం అయిదేళ్ళ వరకూ ఆయన పార్టీ ఎక్కడా పుంజుకునే అవకాశాలైతే లేవు. అది కూడా గట్టిగా జనంలో వ్యతిరేకత జగన్ సర్కార్ మీద వస్తేనే. అపుడు ప్రతిపక్షం పంట పండుతుంది.


మరి ఇపుడు చూసుకుంటె చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షం అన్న మాటే కానీ ఉత్సవ విగ్రహం లాగానే ఉండితీరాలి. అసెంబ్లీలో మొత్తానికి మొత్తం వైసీపీ మెజారిటీ ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలే మూడొంతులు పైగా సీట్లు ఆక్రమించిన వేళ వారి ముందు టీడీపీ వాయిస్ తేలిపోవడం ఖాయం. అయినా సరే క్యాడర్ కి కాస్త ఆశ కల్పించాలంటే చంద్రబాబు జగన్ కి ఎదురుగా కూర్చోవాల్సిందే.


ఇది ఏపీలో టీడీపీ పరిస్థితి. మరి ఇల్లు కాలి ఇలా బాధపడుతున్న టీడీపీని రాహులు గాంధి ఓ వింత కోరిక కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కలసి పనిచేయాలట. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటాలు చేయాలట. ఆ విధంగా కాంగ్రెస్ ని అక్కడ బతికించరూ అంటున్నారుట రాహుల్ బాబా. నిజమే కానీ ఏపీలో అసలు కాంగ్రెస్ అనేది ఏముందని చంద్రబాబు నెత్తిన వేసుకుంటారు.


నోటా కంటే కూడా తక్కువ ఓట్ల శాతం కాంగ్రెస్ కి వచ్చాయి. కాంగ్రెస్ కి 1.29 ఓట్ల శాతం వస్తే నోటాకు 1.48 ఓట్ల శాతం వచ్చింది. ఇపుడున్న పరిస్థితుల్లో టీడీపీనే ఎలా ఒడ్డున పడేయాలని బాబు తెగ పరేషాన్ అవుతూంటే నా సంగతేంటని రాహుల్ అడగడం నిజంగా వింతగానే ఉంది మరి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. తనకు బొత్తిగా లాభం లేని పనిని బాబు అసలు చేయరు. అలాంటిది ఏపీలో కాంగ్రెస్ ని చేరదీయాలనుకోవడం అన్నది ఆయనకు ఇపుడు గుదిబండతో సమానమే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: