ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన జ‌న‌సేన చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ప్ర‌ముఖ సినిమా న‌టుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఐదేళ్ల క్రిత‌మే స్థాపించిన పార్టీ కావ‌డంతో పాటు ప‌వ‌న్‌కు లెక్క‌కు మిక్కిలిగా అభిమానులు ఉండ‌డంతో ప‌వ‌న్ ఈ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చినా రాక‌పోయినా త‌న ప్ర‌భావం చూపుతాడ‌ని అంద‌రూ అంచ‌నా వేశారు. పార్టీ ఓడిపోవ‌డం ప‌క్క‌న పెడితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన గాజువాక‌, భీమ‌వ‌రం లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ప‌వ‌న్ ఘోరంగా ఓడిపోయారు.


ఇక ప‌వ‌న్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త‌మ సొంత ప్రాంత‌మైన న‌ర‌సాపురం నుంచి త‌న సోద‌రుడు నాగ‌బాబును ఎంపీగా పోటీ చేయిస్తే ఆయ‌న కూడా ఓడిపోవ‌డంతో పాటు మూడో ప్లేస్‌తో స‌రిపెట్టుకున్నారు. ఇక ఘోర ఓట‌మితో జ‌న‌సేన‌లో ఇప్పుడిప్పుడే లుక‌లుక‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఇప్ప‌టికే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా క‌న్వీన‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు కూడా గుడ్ బై చెప్పేశారు. రావెల బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వచ్చిన రావెల ప‌వ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసి జ‌న‌సేన ఇంటిగుట్టును బ‌య‌ట‌కు వ‌దిలేశారు.


జనసేన కీలక నేతల్లో తాను కూడా ఒకడిని అన్న వార్త అవాస్తవమని... ప‌వ‌న్ ఎప్పుడూ త‌న స‌ల‌హాలు ఏ మాత్రం తీసుకోలేద‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌కు ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ కూడా దొరికేది కాద‌ని.. క‌నీసం త‌న‌తో ఫోన్లో కూడా మాట్లాడ‌డానికి ప‌వ‌న్ ఇష్ట‌ప‌డేవారు కాద‌ని రావెల వాపోయారు. త‌న‌తో చాలా స‌న్నిహితంగా ఉన్న‌ట్టు ప‌వ‌న్ పైకి కనిపించినా, రాజ‌కీయ వ్యూహాల‌పై చ‌ర్చించే విష‌యంలో త‌న‌ను ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే వారు కాద‌ని ఆయ‌న తెలిపారు.


ఇక టీడీపీ - జ‌న‌సేన మ‌ధ్య సంబంధాల గురించి కూడా రావెల మాట్లాడారు. పై నుంచి కింద‌వ‌ర‌కు ఈ రెండు పార్టీల మ‌ధ్య లింకులు ఉన్నాయ‌న్న ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో దానినే ప్ర‌జ‌లు న‌మ్మార‌ని.. అందువ‌ల్ల జ‌న‌సేన‌కు ఓటు వేస్తే టీడీపీకే వేసిన‌ట్లువుతుంద‌ని భావించిన ప్ర‌జ‌లు అంద‌రూ వైసీపీకే ఓట్లు వేశార‌ని రావెల చెప్పారు. ప‌వ‌న్ ఆశ‌యాలు, సిద్ధాంతాలు, స‌మాజంలో మార్పు తీసుకు రావాల‌న్న ఆయ‌న త‌ప‌న గొప్ప‌వే అని.. అయితే అధికారంలోకి రాకుండా ఎన్ని మాట‌లు చెప్పినా వృథాయే అని రావెల చెప్పారు. అధికారం సాధించే క్ర‌మంలో ప‌వ‌న్ ఏ మాత్రం స‌క్సెస్ కాలేద‌ని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: