నిర్భయ ఘటనను తలపించేలా...దేశ స‌రిహ‌ద్దులోని క‌శ్మీర్‌లో జ‌రిగిన కథువా ఘటన యావత్ భారతాన్ని కదిలించింది.  కఠువా జిల్లాలోని రసానా గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల‌ బాలిక గత ఏడాది జనవరి 10న గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల తరువాత జనవరి 17న గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ బాలిక మృతదేహం లభించింది. ఆ బాలికపై పాశవికంగా సామూహిక లైంగిక దాడి జరిగిందని, ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. దీనిపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఓ కుగ్రామంలోని ఆలయంలో బందీగా ఉంచారు. ఆ ఆలయానికి సాంజీరాం సంరక్షకునిగా ఉన్నాడు. నాలుగురోజులపాటు ఆ బాలికకు మత్తుపదార్థాలు ఇస్తూ, సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను దారుణంగా హతమార్చారు. తాజాగా వీరికి శిక్ష ప‌డ‌గా...ఈ తీర్పు వెనుక ఉన్న‌ది ఓ మ‌హిళా లాయ‌ర్‌.


ఈ కేసులో తొలుత బాధిత కుటుంబానికి అండగా నిలిచారు దీపికా సింగ్ రజవాత్ అనే న్యాయవాది. చిన్నారిపై జరిగిన ఘాతుకానికి చలించి, బాధితురాలి తండ్రిని కలిసి కోర్టులో కేసు దాఖలు చేశారు దీపిక. ఈ కేసు చేపట్టిన తర్వాత ఆమెకు ఎన్నో బెదిరింపులు, అవమానాలు ఎదురయ్యాయి. తనను కూడా రేప్ చేస్తామని దుండగులు భయపెట్టారు. కేసును వదిలేయాలని జమ్ము కశ్మీర్ బార్ అసోసియేషన్ నుంచి కూడా బెదిరింపులు వచ్చాయి. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కశ్మీరీ పండిట్ అయిన దీపిక స్వస్థలం కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కరిహామా. ఆమె భర్త మాజీ సైనికాధికారి. ప్రస్తుతం బహ్రెయిన్‌లో ఉంటున్నారు. మాతృదేశానికి సేవలందించాలనే ఉద్దేశంతో దీపిక తన కూతురితో కలిసి జమ్ము కశ్మీర్‌లోనే ఉంటున్నారు. ఆమె న్యాయవాది మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా. వాయిస్ ఫర్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చిన్నారులకూ, మహిళలకు సేవలందిస్తున్నారు. అసిఫా కేసు కఠువా నుంచి పంజాబ్‌లోని పఠాన్‌కోఠ్‌కు బదిలీచేయడంలో దీపిక ఎంతో కృషి చేశారు.


అయితే తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్న కారణంగా ఆమె కేసు విచారణకు హాజరుకావడం లేదని, ఈ కేసు నుంచి ఆమెను తప్పించాలని బాలిక తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. ఆమెను కేసు నుంచి తప్పించింది. దీనిపై దీపిక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధితుల నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఫీజుగా తీసుకోలేదు. బాలికకు న్యాయం జరుగాలన్నదే నా తపన. కింది కోర్టులు, హైకోర్టులో పలు కేసులతో నాపై అధిక పనిభారం ఉన్నది అని ఆమె అప్పట్లో పేర్కొన్నారు. భయంతో ఎవరూ ముందుకు రాని సమయంలో తాను బాధిత కుటుంబానికి అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. కోర్టు తీర్పు.. అసిఫాకు నివాళి అని, సత్యమే ఎప్పటికైనా విజయం సాధిస్తుందని ట్వీట్ చేశారు. బెదిరింపులు, అవమానాల మధ్య కథువా కేసును సవాల్‌గా తీసుకున్న తన న్యాయవాది జీవితంపై త్వరలోనే పుస్తకం తీసుకురానున్నట్టు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: