ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు నాలుగు నెలల్లో విపక్ష తెలుగుదేశం పార్టీలో పెను ఉపద్రవం రాబోతుందా ? ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారా ? ఈ మేరకు ఇప్పటికే వారు బేర‌సారాలు మొదలు పెట్టేశారా ?  అంటే తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ చర్చల్లో ఇదే విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ తాజా సాధారణ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. టిడిపి కేవలం 23 అసెంబ్లీ సీట్లతో పాటు, మూడు లోక్‌స‌భ సీట్లకు పరిమితమైంది. ఈ ఫలితాలను ఓ సగటు టిడిపి అభిమాని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చేసింది. 


చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే నడుస్తున్న కార్యకర్తలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం... గ్రామాల్లో తమ మనుగడ కోసం ఇతర పార్టీల్లోకి జంప్ చేసే ఆలోచన చేస్తున్నారు. కార్యకర్తల ఆలోచన ఇలా ఉంటే ఇక ఎప్పుడు అవకాశం వచ్చినా గోడ దూకడానికి రెడీగా ఉన్న‌ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే టిడిపికి చెందిన పలువురు సీనియర్ నేతలు ఇప్పుడు బిజెపి అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్ నేతలు బీజేపీతో బేరసారాలు ఆడటం మొదలు పెట్టేశారు. ఈ బేరసారాలు తెగిన వెంటనే వారంతా మూకుమ్మడిగా పార్టీ జంప్ చేసేందుకు ఒప్పుకున్నారు. 


ఇక తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి వెన్నుదన్నుగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా కొందరు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు సైతం ఇప్పటికే అనేక ఆరోపణల్లో చిక్కుకుని ఉన్నారు. వీరు కూడా బీజేపీలోకి వెళితే తమపై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఆపరేషన్‌కు ప్లాన్ చేసిన బిజెపి కేంద్ర నాయకత్వం ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 


ఇక బీజేపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్న నేతల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన ఒక సిట్టింగ్ ఎంపీ తాజా ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆయన చంద్రబాబుకు తలనొప్పి కలిగించేలా వ్యవహరిస్తున్నారు. బిజెపి అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని... ఆయన ఎప్పుడైనా బిజెపిలోకి వెళ్లి పోతార‌న్న ప్రచారం జరుగుతోంది. వచ్చే నాలుగైదు నెలల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ మరింత స్థితిలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు చంద్రబాబుకు షాక్ ఇచ్చేలా సైకిల్ దిగి పోతారని సమాచారం. ఏదేమైనా టిడిపి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఒక మైనస్ అయితే... చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని లోకేష్‌ను నమ్ముకుంటే ఏటికి ఎదురీత త‌ప్ప‌దు అన్నది ఆ పార్టీ వాళ్లకు స్పష్టంగా అర్థమైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: