వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎట్ట‌కేల‌కు మౌనం వీడారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో రోజాకు మంత్రి పదవి రాలేదు. జగన్ మంత్రివర్గ విస్తరణకు కూడా రోజా హాజరుకాలేదు.కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదని మనస్తాపంతో ఉన్నారన్న వార్తల మధ్య..  సీనియర్ ఎమ్మెల్యే రోజాకు… ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఉదయం నగరి ఎమ్మెల్యే రోజాకు విజయ సాయి రెడ్డి ఫోన్ చేశారు. సాయంత్రం విజయవాడలోని సీఎం ఇంట్లో జగన్ ను కలవాలని సూచించారు. దీంతో రోజా హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఎం ఇంటికి బయల్దేరి వెళ్లారు.


కేబినెట్‌ కూర్పు అనంతరం తొలిసారిగా విజయవాడ వచ్చిన రోజా ఈ సందర్భంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మంత్రి పదవులు లభించిన అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. కుల సమీకరణాల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని అనుకుంటున్నానని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదన్న రోజా.. తాను అలిగానన్నది మీడియా ప్రచారం మాత్రమేనని అన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఉంటే సరిపోతుంది కదా..  ఎమ్మెల్యేలు ఎందుకు? అందుకే నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు' అని చెప్పారు. తనకు నామినేటెడ్‌ పదవి ఇస్తానని ఎవరూ చెప్పలేదని.. అది కూడా మీడియా సృష్టేనని ఆమె తెలిపారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసమే విజయవాడ వచ్చానని రోజా అన్నారు. 


ఇదిలాఉండగా, రోజాకు మహిళా సంక్షేమ శాఖ కమిషనర్ పోస్ట్ ఇవ్వాలని జగన్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. దీంతోపాటుగా ఆర్టీసీ చైర్మన్ ప‌ద‌వి విష‌యంలో ఆమె పేరును ప్ర‌తిపాదించిన‌ట్లు స‌మాచారం. ఈ ప‌ద‌వుల‌పై ఒక‌ట్రెండు రోజుల్లో క్లారిటీ రానుంద‌ని తెలుస్తోంది. అయితే, జ‌గ‌న్‌, రోజా మ‌ధ్య ఏం చ‌ర్చ జ‌రిగింది? మ‌ంత్రి ప‌ద‌వి విష‌యంలో జ‌గ‌న్ రోజాకు ఏం చెప్పారు?  రోజా ఏం వాద‌న వినిపించింది అనే విష‌యంలో స్ప‌ష్టత రానున్నట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: