ఏపీలో వైసీపీ బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి రావ‌డంతో ఇప్పుడు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీట్లు త్యాగాలు చేసిన వారు, ఎమ్మెల్యే టిక్కెట్లు రాని వారు ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల కోసం అప్పుడే ప్ర‌య‌త్నాలు ప్రారంభించేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వైసీపీలో పలువురు నేతలు ఎమ్మెల్సీ పదవులకోసం రేసులో ఉన్నారు. వీరిలో కొందరికి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఉన్నారు. ఇక టిడిపి,  వైసిపిల్లో కొందరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఇప్పుడు వారంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ లెక్కన మొత్తం శాసనమండలిలో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. 


వైసీపీ నుంచి ఎమ్మెల్సీ రేసులో ఉన్న వారిలో కొందరు తమకు ఎమ్మెల్సీ పదవులు ఖాయం అయినట్టు చెబుతున్నారు. మండ‌లిలో వ‌చ్చే ఐదేళ్ల పాటు ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా అవ‌న్నీ వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలలో 151మంది వైసీపీ తరపున గెలుపొందినందున ఆ కోటాలో వచ్చే ఎమ్మెల్సీ ఖాళీలన్నీ వైసీపీనే గెల్చుకోబోతోంది. టీడీపీకి కేవలం 23మంది ఎమ్మెల్యేలే ఉన్నందున ఒక్క స్థానం కూడా లభించే అవకాశం లేదు. 


కీలకమైన గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కొందరు ఎమ్మెల్సీ పదవుల రేసులో ముందు ఉన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బీసీ మహిళ విడ‌దల ర‌జ‌నీ కోసం త్యాగం సీటు చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ను జగన్ ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ర‌జ‌నీ విజయం సాధించడంతో మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేస్తున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్సీ లేదా మిర్చి యార్డు చైర్మ‌న్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. 


ఇక ప్ర‌కాశం జిల్లా నుంచి కూడా ఇద్ద‌రికి ఎమ్మెల్సీ ప‌ద‌విపై జ‌గ‌న్ నుంచి ఇప్ప‌టికే హామీ వ‌చ్చింది. ఈ ఎన్నికలలో ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సీటు వ‌దులుకున్నారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ ప‌ద‌విపై హామీ ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న దర్శితో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుకి కృషిచేశారు. ఇక ఆర్థికంగా కూడా కొంత ఖ‌ర్చు పెట్టుకున్నారు. ఈ  కుటుంబానికి జ‌గ‌న్‌తో ఉన్న సంబంధాల నేప‌థ్యంలో జిల్లా నుంచి తొలి ఎమ్మెల్సీ బూచేప‌ల్లికే అంటున్నారు.


ఇక మార్కాపురం సీటు వ‌దులుకున్న జంకె వెంట‌క‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కి జంకెపై కూడా మంచి గౌరవం ఉంది. ఇక ప‌ర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి గొట్టిపాటి భరత్‌ని తప్పించినప్పుడు జగన్‌ ఆయనకు కూడా హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా భ‌ర‌త్‌కు ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్య‌త నాదే అని మ‌రీ జ‌గ‌న్ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు తోడ‌ల్లుడు ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న సీనియ‌ర్ మ‌రి ఇక్క‌డ ద‌గ్గుపాటికి, భ‌ర‌త్‌కు ఇద్ద‌రికి ఎలా ? ప‌ద‌వులు ఇస్తార‌న్న‌ది కూడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: