జగన్ తో కర్ణాటక సీఎం తనయుడు నిఖిల్ గౌడ భేటీ అవ్వటం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. బెంగళూరు నుంచి అమరావతి వచ్చిన ఆయన జగన్ ను కలవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదన వినిపిస్తోంది. సినిమాల్లో హీరోగా నటించినా... పెద్దగా క్లిక్ కాని నిఖిల్... రాజకీయ అరంగేట్రంలోనూ బోల్తా పడ్డారు. ప్రముఖ సినీ నటి సుమలత చేతిలో ఆయన తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ తో నిఖిల్ భేటీ వెనుక ఉన్న అసలు సిసలు వ్యూహంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. 


గతంలో చంద్రబాబుతో కుమారస్వామితో పాటు దేవేగౌడ కూడా మంతనాలు సాగించి జేడీఎస్ గెలుపు కోసం పలు ప్లాన్లు రచించినా అవేవీ వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పనికాదని తెలుసుకున్న నిఖిల్... రెడ్డి సామాజిక వర్గానికి చుక్కానిలా నిలిచిన జగన్ తో మచ్చిక చేసుకుంటే మంచిదని భావించారట. ఈ క్రమంలోనే ఆయన జగన్ వద్దకు రెక్కలు కట్టుకుని వచ్చి వాలారట. 


కన్నడ నాట ఎప్పుడు ఎన్నికలు జరిగినా...రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకుంటే... మిత్రపక్షాలతో అవసరం లేకుండానే అధికార పీఠం దక్కించుకోవచ్చన్నది నిఖిల్ ప్లాన్ గా చెబుతున్నారు. మరి కన్నడ రెడ్లంతా జేడీఎస్ వైపు తిరగాలంటే... జగన్ లాంటి నేత మద్దతు అవసరమే కదా. అందుకే జగన్ వద్దకు నిఖిల్ వచ్చినట్గుగా విశ్లేషణలు సాగుతున్నాయి. నిఖిల్ తో చర్చల్లో జగన్ ఎలా స్పందించారో తెలియదు గానీ... తన సామాజిక వర్గాన్ని జేడీఎస్ వైపు తిప్పితే... జగన్ కన్నడ నాట కూడా కీలక భూమిక పోషించినట్టే అవుతుంది. కన్నడ నాట జగన్ కు ఓ రేంజిలో ఇమేజీని క్రియేట్ చేయడంతో పాటు జగన్ సహకారంతో తాము కర్ణాటకలో బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు నిఖిల్ ప్లాన్ వేశారన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: