ఏపీ రాజకీయాల్లో కొత్త ఘ‌ట్టం నేడు ఆవిష్కృతం కానున్నాయి. ముఖ్య‌మంత్రి హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష నేత‌గా టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు తొలిసారిగా ఎదురెదురు ప‌డ‌నున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వంలో ఇవే తొలి సమావేశాలు. మొత్తం 5 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి.  ఉదయం 11.05 నిమిషాలకు సభ ప్రారంభమవుతుంది. మొదటి రోజు ఎమ్యెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండో రోజు స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను అధికారికంగా ఎన్నుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఆయన్ను ఆధ్యక్ష స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేయనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన సీతారాంకు సభ అభినందనలు తెలియజేస్తుంది. 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. 15,16 తేదీల్లో సభకు సెలవు. ఈ  17,18న సమావేశాలు జరుగుతాయి. 18న సభ వాయిదా పడుతుంది.


మ‌రోవైపు తాజా సభలో అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు దక్కించుకుని ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. ఆ ఘ‌న‌త సాధించిన పార్టీగా వైసీపీ రికార్డు పుట‌ల్లోకి ఎక్కనుంది. గత 30 ఏళ్లలో అత్యధిక శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు చట్టసభలో అడుగుపెట్టబోతున్న సభ ఇదే కావ‌డం విశేషం. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చెందిన 25 మంది మంత్రుల్లో ఏకంగా 19 మంది కొత్త మంత్రులుగా సభలో ప్రవేశం చేయ‌నున్నారు. జాతీయ పార్టీల ప్రాతినిధ్యం లేకుండా తొలిసారిగా శాసనసభ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుత స‌భ‌లో బీజేపీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల ఎమ్మెల్యేల‌కు ప్రాతినిధ్య‌మే లేదు. ఇక ఒకే ఒక ఎమ్మెల్యేతో జనసేన స‌భ‌లో అడుగుపెట్ట‌నుంది.


మ‌రోవైపు స‌మావేశాల నేప‌థ్యంలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు శాసనసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లుగా కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడులను నియమించారు. ఈ మేర‌కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ప్రకటించారు. అసెంబ్లీలో విప్‌గా బాలవీరంజనేయస్వామిని నియమించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడుకు అవకాశం దక్కగా.. డొక్కా మాణిక్యవరప్రసాద్‌, శ్రీనివాసులు, సంధ్యా రాణిలను  డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు. మండలిలో విప్‌గా బుద్దా వెంకన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: