జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఒక విధంగా చరిత్రగానే చెప్పుకోవాలి. మామూలుగా ఏ పార్టీ అధినేతైనా ముఖ్యమంత్రి అవ్వటం మామూలు విషయమే. కానీ మిగిలిన అధినేతల విషయం వేరు, జగన్ విషయం వేరు. ఎందుకంటే వైసిపి సభకు హాజరైన రెండున్నరేళ్ళల్లో అసెంబ్లీలో జగన్ ఎదుర్కొన్న అవమానాలు గతంలో ఏ ప్రతిపక్ష నేత కూడా ఎదుర్కోలేదన్నది వాస్తవం.

 

2014 ఎన్నికల్లో వైసిపికి 70 సీట్లు రావటం చంద్రబాబునాయుడుకు మింగుడుపడలేదు. జగన్ ను రాజకీయ ప్రత్యర్ధిగా కాకుండా ఓ శతృవును చూసినట్లు చూశారు చంద్రబాబు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ పాత్రను చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. అందుకనే అవకాశం దొరికిచ్చుకుని మరీ అవమానాలకు గురిచేశారు.

 

10వ తరగతి ప్రశ్న పేపర్ల లీకు కావచ్చు, రాజధాని భూముల కుంభకోణం, ఇసుక అక్రమార్జన, నీరు-చెట్టు పథకంలో అవినీతి, పోలవరం, పట్టిసీమ అవినీతి ఇలా...ఇష్యూ ఏదైనా కానీండి వైసిపి లేవనెత్తగానే చంద్రబాబు అండ్ కో సిఎం తాత అయిన వైఎస్ రాజారెడ్డి హత్యా రాజకీయాలను ప్రస్తావించేవారు.  తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడంటూ నానా గోల  చేసేవారు.

 

వైసిపి  ప్రస్తావించిన అంశాలకు సమాధానాలు చెప్పలేక జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అల్లరి చేసేవారు. దాంతో అసలు విషయం పక్కదారి పట్టి సంబంధం లేని అంశాలపై సభలో గోల జరిగేది. దాంతో వెంటనే వైసిపి సభ్యులను స్పీకర్ తో సస్పెండ్ చేయించేవారు. అంటే అసెంబ్లీలో జగన్ ను కానీ వైసిపి సభ్యులను కానీ దాదాపు నోరిప్పనీయకుండా చేశారు చంద్రబాబు.  ఈ అవినీతికి  ఫిరాయింపుల అంశం బోనస్ గా చేరింది.

 

చంద్రబాబు వ్యూహం అర్ధమైపోయిన తర్వాతే జగన్ ఇక అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే చివరి రెండు సంవత్సరాలు అసెంబ్లీ సెషన్సు బాయ్ కాట్ చేసి పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్ళిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా  చంద్రబాబు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుంటే పాదయాత్ర ఆలోచనే జగన్ కు వచ్చేది కాదేమో ?  ఏ సభలో అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా  జగన్ అవమానాలు ఎదుర్కొన్నారో  అదే సభకు  సభా నాయకుడిగా హాజరవుతుండటం చరిత్రనే చెప్పాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: