ఏపీలో గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యంగా రాజధాని భూముల కుంభకోణం, సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, విశాఖ భూముల కుంభకోణంపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల్లో చంద్రబాబు, నాటి నీటి పారుదల మంత్రి దేవినేని ఉమ సాగించిన అక్రమాలు, బినామీల పేరుతో టెండర్లు వేయడం, మొబిలైజేషన్ అడ్వాన్సులతో వందలాది కోట్లు కొట్టేయడం, పనుల్లో భారీగా ఎస్టిమేషన్లు పెంచేసి, తమ బినామీలకు కోట్లాది రూపాయలు లబ్ది కలిగించడం వంటి అవినీతి, అక్రమాలపై సీఎం జగన్ విచారణ చేపట్టనున్నారు.


 తాజాగా కేంద్రంలోని మోదీ సర్కార్ కూడా పోలవరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై బయటపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు సర్కారులో ఏపీ నిటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమపై కేంద్రం ప్రభుత్వం ఉచ్చు బిగించునున్నట్లు విశ్వసనీయ సమాచారం.  ఉమ ఆధ్వర్యంలో చేపట్టిన పట్టిసీమ, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వివిధ ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిపై నిగ్గు తేలుస్తామని, అవసరమైతే రీ టెండర్లను ఆహ్వానిస్తామని ప్రకటించారు. దీంతో గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు పొందిన కాంట్రాక్టర్లతో పాటు, నాటి ఇరిగేషన్ మంత్రి ఉమ, కొందరు అధికారులు కొందరు తీవ్ర ఆందోళనలో పడినట్లు టాక్. 


పులి మీద పుట్రలా జగన్‌తో పాటు టీడీపీ హయాంలో ఉమ నేతృత్వంలో జరిగిన అవినీతి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించిన తీరుపై కేంద్ర జల వసరుల శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు ఏపీ నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా పోలవరంను మేమే కట్టుకుంటామని చెప్పి, తాము పనులకు తగినట్లుగా నిధులు ఇచ్చినా చంద్రబాబు ఒక్క పైసా ఇవ్వలేదని ప్రచారం చేయడాన్ని మోదీ సర్కార్ జీర్ణించుకోలేకపోయింది. ఇప్పటి వరకు ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన పనులకు సంబంధించి కేంద్రం యూసీలు అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా కేంద్రం వల్లనే పోలవరం నిర్మాణం సాగట్లేదని ఎన్నికల ప్రచారంలో దుష్ప్రచారం చేశాడు. దీంతో సీరియస్‌గా ఉన్న మోదీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపేందుకు సిద్ధమైంది. 


 పోలవరం విషయంలో తమను బద్నాం చేసిన చంద్రబాబును ఇరుకున పెట్టడానికి ముందే ఆయన మంత్రివర్గంలో కీలకమైన నీటిపారుదల శాఖను నిర్వహించిన దేవినేని ఉమా పై కన్ను వేయాలన్నది కేంద్రం ఆలోచనగా చెబుతున్నారు. అయితే సాగునీటి ప్రాజెక్టులలో చంద్రబాబు అండతో దేవినేని ఉమ సాగించిన అవినీతి బాగోతాలను మొత్తం స్వయంగా టీడీపీ ఎంపీ కేశినేని కేంద్ర ప్రభుత్వానికి కళ్లకు కట్టినట్లు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకే పార్టీలో ఉన్న దేవినేని ఉమకు, కేశినేని నానికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.

విజయవాడలో చంద్రబాబు దేవినేని ఉమకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంపీ కేశినేని నానిలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది.  తన కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా వినియోగించుకోమని  చెప్పినా చంద్రబాబు కొత్తగా పార్టీ భవనం నిర్మాణ బాధ్యతలు దేవినేని ఉమకు అప్పగించడం పట్ల కేశినేని నాని రగిలిపోతున్నాడు. అందుకే చంద్రబాబుపై, దేవినేని ఉమపై ఫేస్‌బుక్‌లో సంచలన పోస్టులు పెడుతున్నాడు. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రి అయిన సందర్భంగా దేవినేని ఉమకు ధన్యవాదాలు అంటూ వ్యంగంగా పోస్ట్ పెట్టాడు. 


తాజాగా దేవినేని ఉమపై ఉన్న వైరంతో కేశినేని నాని కేంద్ర ప్రభుత్వానికి అప్రూవర్‌గా మారిపోయినట్లు సమాచారం. చంద్రబాబు, దేవినేని ఉమలు కుమ్మక్కై పోలవరంతో సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులలో సాగించిన అవినీతి బాగోతాలను క్లియర్‌కట్‌గా బీజేపీ పెద్దలకు కేశినేని నాని వివరించినట్లు సమాచారం. నాని ఇచ్చిన సమాచారం మేరకు సాగునీటి ప్రాజెక్టులలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి ముందు దేవినేని ఉమను టార్గెట్ చేసి తర్వాత చంద్రబాబును ఇరుకునపెట్టడానికి కేంద్రం రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే కేశినేని నాని బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో దేవినేని ఉమపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి నిజమే కావచ్చు అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. 


 ఒక పక్క జగన్, మరో పక్క కేంద్రం కూడా రంగంలో దిగుతుండడంతో దేవినేని ఉమతో సహా, అవినీతికి సహకరించిన ఇరిగేషన్ శాఖ అధికారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా చంద్రబాబు, దేవినేని ఉమ అవినీతి బాగోతాలను టీడీపీ ఎంపీనే బయటపెట్టడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: