ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని అంచనా వేయడం లో గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్  తప్పటడుగు వేశారా? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి. తనకంటే వయస్సు లో చిన్నవాడు, పరిపాలన అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అయితే తన వ్యక్తిగత ప్రతిష్ట కు  వచ్చిన ఢోకా ఏమి లేదని కేసీఆర్ భావించారు. అదే చంద్రబాబు నాయుడు అయితే ప్రతి విషయం లో ఆయనతో తనని పోలుస్తూ రాజకీయంగా విపక్షాలు తనని ఇబ్బంది పెడుతాయనుకున్న కేసీఆర్ , ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ఇతోధికంగా తెరవెనుక నుంచి తన వంతు సహాయం చేశారు.


ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలై , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం తో కేసీఆర్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మనవాడే ... మనం ఎలా చెబితే ఆలా నడ్చుకుంటాడని భావించిన కేసీఆర్ కు, పాలనాపరంగా తన నిర్ణయాలతో జగన్ పట్టపగలే ఆకాశం లో చుక్కలు కనిపించే లా చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్న నాన్చుడు ధోరణి అవలంభిస్తే, కేసీఆర్ దూకుడు గా సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకుంటూ బాబు కంటే తానే బెటరని అనిపించుకు నేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆ సీన్ రివర్స్ అవుతున్నట్లు కన్పిస్తోంది.


ఉద్యోగుల ఐఆర్ చెల్లింపు పై ఇప్పటికి కేసీఆర్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేందుకు సాగదీత ధోరణి అవలంభిస్తుండగా, ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ 27 శాతం  ఐఆర్ ప్రకటించింది. అంతటితో ఆగకుండా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కిం రద్దుకు కమిటీ ని ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసేందుకు సానుకూల నిర్ణయానికి ఒకే చెప్పింది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టుల సంక్షేమానికి జగన్ సర్కార్ జై కొట్టింది.   ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో జర్నలిస్టులు కూడా కీలక పాత్ర పోషించారన్నది నిర్వివాదాంశమే. అయితే జర్నలిస్టుల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అన్నట్లు పరిస్థితి తయారయిందని జర్నలిస్టు సంఘాల నేతలు అంటున్నారు.


 జగన్ సర్కార్ నిర్ణయం తో తెలంగాణ లో ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొనగా, కేసీఆర్ సర్కార్ కు రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇలా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఒకొక్క నిర్ణయం కేసీఆర్ సర్కార్ కు తలనొప్పి తెచ్చిపెట్టేదిగా ఉండడమే కాకుండా ఆయన వ్యక్తి ప్రతిష్ట మసకబార్చడం ఖాయంగా కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: