ఏపీలో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని బలహీనపరిచి తాము బలపడాలనే ఉద్దేశ్యంతో బీజేపీ పెద్దలు ఉన్నారు. అందులో భాగంగానే టీడీపీలోకి కీలక నేతలను తమ పార్టీలోకి లాక్కుంటోది. రాయలసీమలో బలమైన జేసీ ఫ్యామిలీ, పరిటాల ఫ్యామిలీతో సహా, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి వంటి మాజీ ఎమ్మెల్యేలను, ఎంపీలను త్వరలో  తమ పార్టీలోకి చేర్చుకోబోతుంది బీజేపీ. తాజాగా మాజీ మంత్రి, జనసేన నేత రావెల కిషోర్‌బాబు కూడా బీజేపీలో చేరారు. అధికారంలోని వైసీపీతో తొలుత సఖ్యతతో వ్యవహరిస్తూ, టీడీపీని పూర్తిగా దెబ్బ తీసే పనిలో బీజేపీ ఉంది. మరోవైపు జగన్‌తో సఖ్యతగా ఉంటూనే పక్కలో బల్లెంగా బీజేపీ ఉండబోతుందంటూ ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. తాజాగా  వైసీపీ అధికారంలోకి రావడంతో  అక్కడక్కడ  రాజకీయ దాడులు మొదలయ్యాయి. దీంతో బీజేపీ ఈ పాయింట్‌ను బట్టి సీఎం జగన్ని టార్గెట్ చేస్తోంది. 


తాజాగా ఏపీలో రాజకీయ దాడులు జరగడం దురదృష్టకరం అని...ఏపీని మరో పశ్చిమబెంగాల్ చేయద్దు అంటూ బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వెంటనే స్పందించి ఈ రాజకీయ దాడులని అరికట్టాలని కోరారు. బుధవారం  మీడియాతో మాట్లాడిన ఆంజనేయరెడ్డి.. ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందన్నారు. మాఫియా ఆగడాలను అణిచివేయాల్సిన అవసరం ఉందన్నారు. పీఎం, సీఎంల మధ్య కెమిస్ట్రీ, బాడీలాంగ్వేజ్ బాగున్నాయన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఆంజనేయరెడ్డి సూచించారు. అయితే బీజేపీ వ్యాఖ్యలపై వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఏదో కొన్ని చోట్ల వ్యక్తిగతంగా ఇరు పార్టీల మధ్య దాడులు జరుగుతుంటే వాటిని రాజకీయ దాడులు అంటూ బీజేపీ రాజకీయం చేస్తుందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో సఖ్యత అవసరమైన ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ వైసీపీ భావిస్తోంది. మొత్తంగా ఏపీని బెంగాల్‌తో పోలుస్తూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: