దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితోనే మొద‌లై...ఆయ‌న‌తోనే అంత‌మైన కీల‌క ప్రజాసంక్షేమ కార్య‌క్ర‌మం మ‌రోమారు... ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో తిరిగి తెర‌మీద‌కు రానుంది. రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఆస‌క్తితో ఎదురుచూస్తున్న కీల‌క ప్ర‌క్రియ‌కు వైఎస్ జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌జా ద‌ర్భార్ పేరుతో త‌న తండ్రి నిర్వ‌హించిన ప్ర‌జ‌లు మెచ్చిన కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ మ‌ళ్లీ మొద‌లుపెట్ట‌నున్నారు.  ప్ర‌జ‌ల నుంచి వినతులను స్వీకరించి... అక్కడికక్కడే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించే దిశ‌గా ఈ కార్య‌క్ర‌మం రూపొందించ‌నున్నారు. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరగంట సేపు ప్రజలను కలుసుకోనున్నారు. 

 

ఇటీవ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందులలో పర్యటించి...పులివెందులలో క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ప్రజాదర్బార్ లో భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు పాల్గొన్నారు. అనంత‌రం ఫ‌లితాలు వెలువ‌డ‌టం...వివిధ సంద‌ర్భాల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ప‌లువ‌ర్గాల వారు విన‌తులు అందిస్తున్న నేప‌థ్యంలో...జ‌గ‌న్ ప్ర‌జాద‌ర్బారుపై దృష్టి సారించారు.  త‌న‌ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రతి రోజు ఉదయం కొంతసేపు సామాన్యులను కలుసుకుని వారి సమస్యలు విన్న వైఎస్ఆర్... వాటికి పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించిన రీతిలోనే సామాన్యులు తనను కలుసుకునేందుకు త‌న తండ్రి వ‌లే అవకాశం కల్పించాల‌ని భావించిన జ‌గ‌న్‌ త‌న ప్ర‌జా ద‌ర్బారు ఏర్పాట్ల‌పై సీఎం కార్యాలయ అధికారులకు సూచ‌న‌లు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 

వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రజాదర్బార్ ప్రారంభించేందుకు జ‌గ‌న్ దాదాపుగా సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఉదయం 30 నిమిషాల పాటు ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించనున్న సీఎం జగన్ అనంత‌రం ముఖ్య‌మంత్రి హోదాలో వివిధ కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, విన‌తులు ఇచ్చేవారికి జిల్లాల వారీగా అవ‌కాశం ఇస్తారా లేదా రాష్ట్రవ్యాప్తంగా ఎవ‌రైనా రావ‌చ్చ‌నేలా చూస్తారా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: