కేంద్రంలో రికార్డు స్థాయి మెజార్టీతో అధికారం కైవ‌సం చేసుకున్న భారతీయ జనతాపార్టీ తెలుగు బిడ్డ‌కు కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. ఢిల్లీకి పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల విష‌యంలో మ‌న ప్రాంత బిడ్డ‌కు చాన్స్ ఇచ్చింది. ఇలా వ‌రుస‌గా రెండో సారి అవ‌కాశం క‌ల్పించింది. బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తయిన కామర్సు బాల సుబ్రమణ్యంను మరోసారి నియమించారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ కార్యవర్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఈ నియామ‌కం చేశారు.


2014లో కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడిన తర్వాత కామర్సు బాలసుబ్రహ్మణ్యంను బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా నియమించారు. త‌ర్వాత తాజాగా మ‌రోమారు పార్టీ అధికారంలోకి రావ‌డంతో....ఆ ప‌ద‌వికి తిరిగి  బాలసుబ్రహ్మణ్యంను ఎంపిక చేశారు. ఇదిలాఉండ‌గా, 2007 నుంచి 2010 వరకు బాల సుబ్రమణ్యం బీజేపీ జాతీయ మీడియా సహా కార్యదర్శిగా భాద్యతలు నిర్వహించారు.  నితిన్ గడ్కరీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లీగల్ సెల్ జాతీయ సహా కార్యదర్శిగా పని చేశారు. కామర్సు బాల సుబ్రహ్మణ్యం రెండు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వివిధ స్థాయిలో పని చేశారు. 2007 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ బిజెపికి సేవలు అందిస్తున్నారు.


ఇదిలాఉండ‌గా, రెండో సారి తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇవాళ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీని పార్లమెంటరీ పార్టీ నేతగా...లోకసభ డిప్యూటీ లీడర్‌గా రాజ్‌నాథ్‌సింగ్‌ను నియమించింది. ఇక రాజ్యసభ లీడర్‌గా తావర్ చంద్ గెహ్లాట్‌ను నియమించిన బీజేపీ... రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా పీయూష్ గోయల్ నియమించింది. కాగా, తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17, 18 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనుండగా... 19వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక జులై 5వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: