ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీకి రోజుకో కొత్త కష్టం వచ్చి పడుతోంది. అసలే 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోనూ... బయట ఐదేళ్లపాటు బండి ఎలా నెట్టుకురావాలా ? అని ఆందోళనతో ఉన్న చంద్రబాబుపై ఇప్పుడు సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు క్రమశిక్షణకు తెలుగుదేశం పార్టీ కేరాఫ్‌గా ఉండేది. 2015 నుంచి పార్టీ నేతల చర్యలతో ఆ పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ గాడిత‌ప్పుతూ వస్తోంది. పార్టీలో పదవులు రానివాళ్లు రోడ్డెక్కి నానా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అటు లోక్‌స‌భలోనూ టిడిపికి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. గెలిచిన వాళ్లే తక్కువ అనుకుంటే... ఇప్పుడు పదవులకోసం గొడవలకు దిగుతుండడంతో చంద్రబాబుకు తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయి.


విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఐదేళ్ల పాటు పార్టీలో త‌న‌కు ప్ర‌యార్టీ లేకుండా చేసిన బాబుపై ఇప్పుడు త‌న అక్క‌సు అంతా తీర్చుకుంటున్నారు. చంద్ర‌బాబు, దేవినేని ఉమాను టార్గెట్‌గా చేసుకుని ఫేస్‌బుక్‌లో వ‌రుస‌గా పోస్టులు పెడుతోన్న ఆయ‌న అటు గ‌ల్లా జ‌య‌దేవ్‌పై కూడా గుర్రుగా ఉన్నారు. కీల‌క ప‌ద‌వులు గ‌ల్లా ఫ్యామిలీకే క‌ట్ట‌బెట్టి త‌న‌కు కేవ‌లం పార్టీ విప్ ప‌ద‌వితో స‌రిపెట్ట‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోయారు. అదే టైంలో త‌న‌కు విప్ ప‌ద‌వి వ‌ద్ద‌ని.. ఆ ప‌ద‌వి చేప‌ట్టేంత సామ‌ర్థ్యం త‌న‌కు లేద‌ని కూడా బాబుపైనే ప‌రోక్షంగా సెటైర్ వేశారు.


ఇదిలా ఉంటే తాజాగా జ‌రిగిన టీడీఎల్పీ స‌మావేశంలో చంద్ర‌బాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు పార్టీ ప‌ద‌వులు పంచారు. అసెంబ్లీలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబు, ఉపనేతలుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి, నిమ్మ‌ల రామానాయుడు, విప్‌గా డోలా శ్రీ బాలా వీరాంజ‌నేయ‌స్వామిల‌ను నియమించారు. మండలిలో ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా, సంధ్యారాణి, జి. శ్రీనివాసులు, విప్‌గా బుద్దా వెంకన్న నియామకాన్ని చంద్రబాబు ఖరారు చేశారు.


అయితే ఇప్పుడు త‌మ‌ను బాబు ప‌ట్టించుకోలేద‌ని బాబు సామాజిక‌వ‌ర్గానికే చెందిన కొంద‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు గుస్సాగా ఉన్నార‌ట‌. ఈ సారి పార్టీ నుంచి గెలిచిన వాళ్ల‌లో బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారే అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పార్టీ ఇంత చెత్త‌గా ఓడినా తాము మాత్రం త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యాలు సాధిస్తే.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం ఏ మాత్రం స‌మంజ‌సంగా లేద‌ని బాబు సామాజిక‌వ‌ర్గ ఎమ్మెల్యేలు మ‌ద‌న ప‌డుతున్నార‌ట‌. ఏదేమైనా ఇప్ప‌టికే నానిని చ‌ల్చార్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్న బాబుకు ఇప్పుడు పార్టీ నేత‌ల‌తో రోజుకో త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: