ఏపీ తొలి అసెంబ్లీ సమావేశాల రెండో రోజునే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో టిడిపి అధినేత చంద్రబాబు గుండెల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తమతో టచ్లో ఉన్నారని... తాము ఒక్క సైగ చేస్తే అసెంబ్లీలో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోటం రెడ్డి వ్యాఖ్యలతో టిడిపిలో ఎవరికి వారు వైసీపీతో టచ్లో ఉన్నారని భుజాలు తడుముకుంటున్నారు.  ఈ ప్రకటన ఇలా ఉంటే చంద్రబాబుకు దిమ్మతిరిగే మరో న్యూస్ జాతీయ మీడియా వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.


టీడీపీకి పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌ల్లో ఉన్న స‌భ్యుల‌ను త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు ఆప‌రేష‌న్ క‌మ‌లం స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇదే న్యూస్ హాట్‌హాట్‌గా ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో బీజేపీ మైనారిటీలో ఉంది. ఈ సభలో టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారిని కలుపుకొని, తగ్గిన తమ బలాన్ని కొంత భర్తీ చేసుకొనే దిశగా సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేశ్‌, కనకమేడలపై కమలం నేతలు కన్ను వేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వీరిలో కొంద‌రు నేత‌ల‌తో అమిత్ షా సూచ‌న‌ల మేర‌కు రామ్‌మాధ‌వ్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే లోక్‌స‌భలో టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీల విజయం సాధించారు. కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు మాత్రమే తాజా ఎన్నికల్లో విజయం సాధించారు కేశినేని నాని తీరు ముందు నుంచి అనుమానాస్పదంగా ఉంది. ఫేస్‌బుక్‌లో పార్టీ అధిష్టానాన్ని టార్గెట్గా చేసుకుని ఆయన పెడుతున్న పోస్టులు చూస్తున్న వారు ఆయన టిడిపి వీడి బయటకు వెళ్లే పనిలో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్ర మాజీ మంత్రి నితిన్ గ‌డ్క‌రీని ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇక గ‌తంలో కూడా టీడీపీ ఎంపీలు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరారు. 1992 మార్చిలో పీవీ నరసింహారావు హయాంలో కూడా ఆరుగురు టీడీపీ ఎంపీలు భూపతి విజయకుమార్‌ రాజు, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగారెడ్డి, కేవీ చౌదరి, కేపీ రెడ్డయ్య, తోట సుబ్బారావు ఆ పార్టీ నుంచి చీలిపోయి మైనారిటీలో ఉన్న పీవీ ప్రభుత్వాన్ని రక్షించారు. అప్ప‌ట్లో ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం ప్రతిప‌క్షంలో ఉంది. ఇక టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌లుగా ప‌నిచేసిన ఉపేంద్ర, రేణుకా చౌదరి వేర్వేరు కారణాలతో ఇతర పార్టీల్లో చేరారు. నామా నాగేశ్వరరావు ఇటీవలే టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని, ఆ పార్టీ తరఫున పోటీచేసి గెలిచారు.


ఏదేమైనా గ‌త యేడాదిన్న‌ర కాలంగా ఏపీలో టీడీపీని ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తూ వ‌స్తోన్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో కొంద‌రు టీడీపీ కీల‌క నేత‌ల‌తో పాటు ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేసిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి. ఇక ఇప్పుడు దీనికి తోడు ఏకంగా టీడీపీని పార్ల‌మెంటులోనే ఖాళీ చేసే ప్ర‌క్రియ జ‌రిగితే టీడీపీకి చావుదెబ్బ లాంటిదే. అస‌లే మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డిన చందంగా ఉన్న టీడీపీ ప‌రిస్థితి మ‌రింత డేంజర్‌లోకి వెళ్లిపోనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: