ఏపీలో ఇవాళ వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న రాజన్న బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండలం, పెనుమాక జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభాస్య కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం జగన్ హాజరయ్యారు.  ముఖ్యమంత్రి ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన సరస్వతి దేవి పటానికి నమస్కరించారు.  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఒకేసారి 2 వేల మంది చిన్నారులకు అక్షరాభాస్యం చేయించడం విశేషం.

సీఎం జగన్ స్వయంగా చిన్నారులతో ఓం అనే బీజాక్షరాలు దిద్దించి, అమ్మఒడిని చల్లగా ఆశీర్వదించారు  ఆ తర్వాత విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేశారు.   ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఒకేసారి 2 వేల మంది చిన్నారులకు అక్షరాభాస్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని   అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజన్నబడిబాట కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే జగన్ సర్కార్ ధ్యేయమని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. తలిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 


ఇక ముఖ్య అతిధిగా విచ్చేసిన సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. చాలా సంతోషంగా ఉంది..ఈ రోజు నా మనసుకు నచ్చిన కార్యక్రమం చేస్తున్నా  కాబట్టి చాలా సంతోషంగా ఉంది..ఇవాళ నాఆశ...నా కోరిక ఒక్కటే..పిల్లలు బడికిపోవాలి...బడుల నుంచి కాలేజీలకు వెళ్లాలి..కాలేజీ నుంచి వాళ్లు డాక్టర్లు కావాలి...ఇంజనీర్లు కావాలి..కలెక్టర్ల నుంచి పెద్ద పెద్ద చదువులు చదవాలి అని అభిలషించారు. ఆ చదువుల కోసం ఏ తల్లి, తండ్రీ అప్పుల పాలయ్యే పరిస్థితి రానే రాకూడనేదే నా ఆశ అని సీఎం జగన్ అన్నారు. పాదయాత్రలో ఎంతో మందిని కలిశాను.

కష్టాలను చూశాను. పేదవాడు పడుతున్న బాధలు విన్నాను. చదివించాలని ఆరాటం ఉన్నా..చదివించలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులను చూశా. పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలని, ఆ చదువుల కోసం అయ్యే ఖర్చులు భరించలేక..పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా నా కళ్లారా చూశా..ఇక నుంచి సంపూర్ణమైన మార్పును తీసుకువస్తామని ధృఢ సంకల్పంతో ఆ రోజు నేను చెప్పా.. ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు మాటిచ్చాను. మీ పిల్లల చదువులు ఇకపై నేను చూసుకుంటానని మాట ఇచ్చా.

ఆ మాట నిలబెట్టుకునే రోజు ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఇవాళ ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి చెబుతున్నా..మీ పిల్లలను బడులకు పంపించండి..ఏ బడికి పంపించినా ఫర్వాలేదు..జనవరి 26 వ తేదీన పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి చేతిలో 15 వేలు పెడతామని, తల్లిదండ్రులు, విద్యార్థుల హర్షధ్వానాల మధ‌్య  సీఎం జగన్ ప్రకటించారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన  ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: