అమ్మ ఒడి..  వైసిపి తన   నవరత్నాలలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ఎన్నికల హామీ  ఇది.   పిల్లవాడిని బడికి పంపితే చాలు  ఏడాదికి 15 వేల రూపాయలు  ఇస్తానని  జగన్ తన ఎన్నికల  ప్రచారంలో చెప్పారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు దిశగా  అడుగులు వేస్తున్నారు.

 

కేవలం  సర్కారు  బడి కే కాదు.. ప్రైవేటు పాఠశాలకు పంపినా  ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తానని జగన్ తాజాగా తేల్చి చెప్పారు. జగన్  ప్రకటనతో  ప్రైవేటు పాఠశాలలు పండుగ చేసుకుంటున్నాయి.  జగన్  అలా ప్రకటన చేసాడో లేదో   అప్పుడే ప్రైవేటు పాఠశాలలు దోపిడీకి తెరలేపాయి.

 

ఆలు లేదు చూలు లేదు  కొడుకు పేరు సోమలింగం  అన్నట్టుగా ఫ్లెక్సీలు తయారు చేస్తున్నాయి.  మా పాఠశాలలో  మీ పిల్లల్ని   చేర్పించండి..  ఏడాదికి 15000  పొందండి అంటూ బ్యానర్లు  కట్టిస్తున్నాయి..  అమ్మ ఒడి పథకం విధి విధానాలు ఖరారు కాకముందే  హడావిడి చేస్తున్నాయి.

 

ప్రైవేటు  పాఠశాలల దూకుడు చూస్తుంటే అమ్మ ఒడి పథకాన్ని  తమ ఆదాయమార్గంగా  మలచుకునే అవకాశాలు  స్పష్టంగా కనిపిస్తున్నాయి.   ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాలో జమ తీసుకునేందుకు ప్రైవేటు పాఠశాలలు తహతహలాడుతున్నాయి.  సరైన నిబంధనలు విధి విధానాలు రూపొందించక పోతే అమ్మ ఒడి పథకం దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: