రాజకీయాల్లో అదృష్టం ఎప్పుడు త‌లుపు త‌డుతుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం తలుపుతట్టే వరకు వేచి చూడాల్సిన ఓపిక నాయకులకు అవసరం. ఏ మాత్రం చిన్న తప్పటడుగు వేసిన రాజకీయంగా కోలుకోవడం చాలా కష్టం. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు దుర‌దృష్టవంతుడు గానే మిగిలిపోనున్నారు. ప్రకాశం జిల్లాలో ఓటమి లేకుండా నాలుగు సార్లు వరుసగా గెలుస్తూ వస్తున్న రవికుమార్ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత విజయాలు సొంతం చేసుకున్నారు. 2004లో తొలిసారి మార్టూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రవి విజ‌యం సాధించారు. పున‌ర్విభ‌జ‌న‌లో ఆ నియోజకవర్గం ర‌ద్దు కావడంతో 2009లో అద్దంకి నుంచి పోటీ చేసి మరోసారి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు.


2014లో వైసిపి నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత టిడిపిలోకి జంప్ చేసి తాజా ఎన్నికల్లో టిడిపి నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అద్దంకిలో ఆయ‌న హ్యాట్రిక్ కొట్టారు. నియోజకవర్గాలు... పార్టీలు మారినా ర‌వి ఓట‌మి లేకుండా గెలుస్తున్నారంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ట్రాప్‌లో పడిన రవి టిడిపిలోకి వెళ్ళినా సామాజిక సమీకరణల్లో ఆయనకు మంత్రి పదవి రాలేదు. గత ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు ఓపికపడితే ఉంటే ఇప్పుడు ఆయన ఖ‌చ్చితంగా మంత్రి అయ్యేవారు.


గొట్టిపాటి ర‌వి టీడీపీలో చేరితే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తోనే ఆ పార్టీలోకి జంప్ చేసేశారు. తీరా 2017లో జ‌రిగిన ప్రక్షాళ‌న‌లో బాబుకు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన న‌లుగురు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన బాబు ర‌విని మాత్రం ప‌క్క‌న పెట్టారు. ర‌వి టీడీపీలో చేరార‌న్న మాటే కాని ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఆయ‌న ఇక్క‌డ స‌రిగా ఇమిడే ప‌రిస్థితి లేదు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్సెస్ ర‌వి మ‌ధ్య ఆధిప‌త్య పోరుతోనే కాలం గ‌డిచిపోయింది.


చివరకు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపిని వీడి వైసీపీలో చేరడంతో చంద్రబాబు కరణం బలరాంను చీరాలకి పంపి అక్కడి నుంచి పోటీ చేయించారు. దీంతో రవికి అద్దంకిలో పెద్ద తలనొప్పి తప్పినట్లయింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో రవి నాలుగోసారి గెలిచినా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తను అనవసరంగా పార్టీ మారి తప్పు చేశానని.. జగన్ ను నమ్ముకుని ఉంటే తనకు ఈసారి కచ్చితంగా మంత్రి పదవి ల‌భించేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.


జగన్ తనకు ఎంతో ప్ర‌యార్టీ ఇచ్చార‌ని... పార్టీలు ప‌ద‌వులు కూడా ఇచ్చారని... వాటిని వదులుకుని టీడీపీలోకి వచ్చినా ఇక్కడ తనకు ఒరిగిందేమీ లేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. విచిత్రమేంటంటే వైసీపీలో రెండు సార్లు గెలిచిన నేతల్లో చాలామందికి మంత్రి పదవులు దక్కాయి. నాలుగు సార్లు గెలిచిన రవి ఇప్పుడు ఆ పార్టీలో ఉండి ఉంటే ఆయన కూడా కచ్చితంగా మంత్రి అయ్యవారు. పార్టీ మారి ఆయన ఆ అదృష్టాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: