రైల్వే ట‌న్నెల్‌. అంటే.. అంద‌రికీ తెలిసిందే.. కొండ‌ల‌ను తొలిచి వాటి గుండా ప్ర‌యాణాన్ని సౌల‌భ్యం చేసే మార్గం. రైల్వే లు దాదాపు ఇలాంటి మార్గాల‌ను కూడా ఏర్పాటు చేసుకుంటాయి. ఎక్కువ దూరం, త‌క్కువ స‌మ‌యంలో చేరుకునేందు కు ఇలాంటి ట‌న్నెల్స్ రైల్వేకి బాగా ఉప‌క‌రిస్తున్నాయి. తాజాగా ఏపీలోని జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో దేశంలోనే అతి పొడ వైన రైల్వే టన్నెల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఒక్క గేటు కూడా లేని రైల్వేలైను ఇది. సుమారు 16 మీటర్ల ఎత్తైన మట్టి కట్ట నిర్మించి దానిపై ట్రాక్‌ ఏర్పాటు చేశారు. వాహనాలు, ప్రజలు తిరిగేందుకు వీలుగా వంతెనలు నిర్మించారు. 


మరోవైపు వెలుగొండ అడవిలో రెండు సొరంగమార్గాలను నిర్మించారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఓ కొండకు ఏకంగా 7.5 కి.మీ పొడవున సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 కి.మీ మామూలు రైలు మార్గం ఉంటుంది. తిరిగి కడప జిల్లా పరిధి లో సుమారు ఒక కిలోమీటరు పొడవుతో మరో సొరంగం నిర్మించారు. క‌డ‌ప జిల్లాలోని ఓబులవారిపల్లె నుంచి నెల్లూరు జిల్లా వెంకటాచలం వరకు ఆరు రైల్వేస్టేషన్లుఏర్పాటు చేశారు. కడప జిల్లాలో మంగంపేట, చెర్లోపల్లె, నెల్లూరు జిల్లాలో నవాబు పేట, సంకురాత్రిపల్లె, కుటుమారుపల్లె, కసుమూరుల్లో అధునాతన సౌకర్యాలతో స్టేషన్లు నిర్మించారు. 


రాపూరు మండలంలోని కండలేరు డ్యాం రోడ్డు పాయింట్‌ వద్ద భారీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, కడప జిల్లాలోని చెర్లోపల్లె, మంగంపేట వద్ద కూడా ప్రత్యేక సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ మార్గం మీదుగా త్వరలో రైళ్లు నడపడానికి రైల్వే శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేసినా సొరంగ మార్గం పనులు పూర్తికాకపోవడంతో రైళ్లు నడపలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించారు. 


కాగా, సుమారు రూ.1950 కోట్లతో 113 కి.మీ పొడవున ఈ రైలు మార్గం నిర్మించారు. త్వరలో అధికారికంగా ప్రధానమంత్రి ఈ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. అటవీ ప్రాంతంలో రైలు నడవడంతో అటు నెల్లూరు జిల్లాలోని రాపూరు, ఇటు కడప జిల్లాలోని చెర్లోపల్లె, నేతివారిపల్లె, చిట్వేలి, ఓబులవారిపల్లె ప్రజలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి 2004లోనే ఈ లైను కు బీజీలు ప‌డినా.. ఇప్ప‌టికి పూర్తి కావ‌డంతో జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చే అంశంగా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: