తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అయితే తాజాగా ‘తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే’ అంటూ మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి, సీఎల్పీని తెరాసఎల్పీలో విలీనం చేయడంతో దెబ్బతిన్న టీపీసీసీకి రాజగోపాల్‌రెడ్డి తీరు మరింత ఇబ్బందికరంగా మారింది. 


పార్టీ మారుతున్నట్లు పరోక్షంగా ప్రకటించిన ఆయనపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ శ్రేణుల్లో నెలకొంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమాచారం.కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని తాజా మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. భట్టివిక్రమార్క ఈ మేరకు స్పందించారు. 

ఆయన వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు బలమైన పునాదులు ఉన్నాయని, సీనియర్‌ నాయకులు అలా మాట్లాడటం సరికాదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని వెల్లడించారు

‘రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. నేను మాత్రం కాంగ్రెస్‌ను వీడను.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాననే నమ్మకంతోనే ఎంపీగా గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. మరో నాలుగున్నరేళ్లలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం’’ అని పేర్కొన్నారు.  రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారుతారా అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదని, అయినా కుటుంబసభ్యులు వివిధ పార్టీల్లో ఉండటం కొత్తేం కాదని జవాబిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: