తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఒక ప్రముఖ దినపత్రిక పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఆ పత్రిక సంగతి తేల్చడానికి త్వరలోనే తగు నిర్ణయం తీసుకోనున్నట్లు , అసత్య వార్తలు హైలైట్‌ చేసే ఆ పత్రికపై ఉద్యోగ సంఘాలు ఒక లుక్‌ వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు 16.6.2019న హన్మకొండలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడారు.

''హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన జేఏసీ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని గానీ, ప్రభుత్వం పట్ల తమకు నిరసన ఉందని గానీ ఎక్కడా అనలేదు. ప్రభుత్వంతో చర్చించి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని అన్నారు. కానీ, సదరు పత్రిక అనని మాటలను అన్నట్టు వక్రీకరించి రాసింది. ఎంత కాలం ఇలాంటి పత్రికలను భరిస్తాం.? '' అని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవేశంగా అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నీళ్లు లేవని, ప్రాజెక్టు నిర్మాణం కూడా నిష్ఫలమే అవుతుందని, గోదావరిలో నీరు లభ్యం కాదని వార్తలు ప్రచురించిందని ఆయన వ్యాఖ్యానించారు. మనకు, ప్రభుత్వానికి ద్రోహం చేయాలని ప్రయత్నం చేస్తున్న వారికి భయపడకుండా.. వారిని టార్గెట్‌ చేసుకొని తెలంగాణ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. 

ఆ 'పత్రిక' స్సందన ఇది... 
శ్రీనివాస్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యల పై ఆ పత్రిక స్సందించింది.

 '' శనివారం తెలంగాణ ఉద్యోగ, అధికార, ఉపాధ్యాయ, పింఛనుదారులు, కార్మికుల తెలంగాణ జేఏసీ సమావేశం జరిగిన తర్వాత తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కారెం రవీందర్‌ రెడ్డి, సెక్రటరీ జనరల్‌ మమత విలేకరులతో మాట్లాడిన మాటలను 'ఆంధ్రజ్యోతి' ప్రచురించింది. అదే సమయంలో, జేఏసీ సమావేశంలో నాయకులు అంతర్గతంగా చేసిన వ్యాఖ్యలను కూడా 'ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమిది' పేరిట మరో కథనంలో అందించింది. సమాచారాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే , ఆ వార్తను ప్రచురించింది. ఇందుకు ఇప్పటికీ కట్టుబడి ఉంది.'' అని వివరణ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: