విద్య, ఆరోగ్య రంగాల వృద్ధికి పటిష్ట పథకాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అఖిలపక్ష సమావేశంలో జగన్ తన అబిప్రాయాలను గట్టిగా వినిపంచారు. ఆయన ప్రసంగంలో ఇలా మాట్లాడారు. ‘నేటి ఎజెండాలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పటిష్ట కార్యక్రమాలను ప్రకటించాలని ప్రధానిని కోరుతున్నా.

 

ముఖ్యంగా జాతీయస్థాయిలో విద్యారంగంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో(జీఈఆర్‌) వృద్ధి చేసేందుకు, వైద్యం కోసం వెచ్చించాల్సిన ఖర్చును తగ్గించడానికి వీలుగా పటిష్ట కార్యక్రమాలను ప్రకటించాలి. బ్రిక్స్‌ దేశాలతో పోల్చితే ఉన్నత విద్యారంగంలో 25 శాతంతో మనదేశం రెండో అత్యల్ప జీఈఆర్‌ కలిగి ఉంది. ఆర్థిక స్థిరత్వం లేక, పేదరికం కారణంగా చాలా మంది పిల్లలు ఉన్నత విద్యకు దూరంగా ఉండిపోతున్నారు.

 

బ్రిక్స్‌ దేశాల్లో రష్యా 81 శాతం జీఈఆర్‌ కలిగి ఉంది. ఆ తర్వాత బ్రెజిల్‌ 50 శాతం, చైనా 48 శాతం, దక్షిణాఫ్రికా 21 శాతం కలిగి ఉంది. అలాగే విద్యా రంగంలో ప్రభుత్వ వ్యయం అత్యల్పంగా జీడీపీలో 3.5 శాతం మాత్రమే ఉంది. మిగిలిన బ్రిక్స్‌ దేశాల్లో ఇదే అత్యల్పం. బ్రెజిల్‌లో 6.20 శాతం ఉండగా, దక్షిణాఫ్రికాలో 6.10 శాతం, చైనాలో 4.20 శాతం, రష్యాలో 3.80 శాతంగా ఉంది.

 

ఆరోగ్య రంగానికి మన దేశంలో జీడీపీలో కేవలం 1.3 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాం. బ్రిక్స్‌ దేశాల్లో ఇదే అత్యల్పం. దక్షిణాఫ్రికాలో ఇది 8.80 శాతంగా, బ్రెజిల్‌లో 8.30 శాతంగా, రష్యాలో 7.10 శాతంగా, చైనాలో 5 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో ఆరోగ్య రంగంలో చేస్తున్న మొత్తం వ్యయంలో వైద్యం కోసం దేశ ప్రజలు చేస్తున్న వ్యయమే 65 శాతంగా ఉంది. బ్రిక్స్‌ దేశాల్లో ఇదే అత్యధికం.

 

బ్రెజిల్‌లో 44 శాతంగా ఉండగా, రష్యాలో 41 శాతం, చైనాలో 34 శాతం, దక్షిణాఫ్రికాలో 8 శాతంగా ఉంది. అందువల్ల వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తున్న మనదేశానికి జాతీయ స్థాయిలో జీఈఆర్‌ని వృద్ధి చేసే పథకాలు, ప్రజల వైద్య ఖర్చును తగ్గించగలిగే పథకాలను ప్రధాని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా బ్రిక్స్‌ దేశాల్లో ఉత్తమ దేశంగా రాణించేలా తోడ్పడాలని కోరుతున్నా’ అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: