తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా....అంద‌రూ  రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు గురించి ప్ర‌స్తావించిన వారే. ప్రాజెక్టు నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించిన హ‌రీష్‌ను ప‌క్క‌న పెట్టేశార‌నే చ‌ర్చ జోరుగా సాగింది. ఈ నేప‌థ్యంలో...హ‌రీష్‌రావు త‌న అనుభ‌వాలు వివ‌రించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాల్లో సిద్ధిపేటలో పాల్గొన్న హ‌రీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తాము పడిన కష్టాన్ని ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. ఇంజినీర్ల కష్టం.. భూనిర్వాసితుల త్యాగఫలమే కాళేశ్వరం ప్రాజెక్టు అని హరీష్ రావు అన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా పట్టుబట్టారు కాబట్టే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకోసం పగలు, రాత్రి కష్టపడి పనిచేశారు కాబట్టే మూడేళ్లలో ఈ అద్భుతం ఆవిష్కారం అయిందని హరీష్ రావు అన్నారు. “44 డిగ్రీల ఎండలో.. సుర్రుమనే ఇసుకలో కార్మికులు, అధికారులు, అందరం కష్టపడ్డాం. ముట్టుకుంటే సలాకలు సుర్రుమనేవి. ఆ ఎండలో కాంక్రీటు వేయాలి. కిందనేమో గోదావరి ఇసుక. సల్లతాగుతూ.. గంట పనిచేసి.. గంట సేపు సేద తీరేవాళ్లం. ఆ కార్మికులకు. శిరసు వంచి వందనం చేస్తున్నా” అని హరీష్ రావు అన్నారు. అంత రాష్ట్ర ఒప్పందం కోసం చేసిన ప్రయత్నాలను కూడా హరీష్ రావు వివరించారు.

సీఎస్ జోషి, ఈఎన్సీ హరేరామ్, నేను ఓసారి అంతరాష్ట్ర ఒప్పందం విషయంలో మహారాష్ట్రకు వెళ్లాం. వెళ్తే పనికాలేదు. పొద్దున వెళ్లి సాయంత్రం వస్తామని వెళ్లాం. పనికాలేదు. తెల్లారి కావాల్సి ఉంది. ఏం చెయ్యాలె బట్టలు తీసుకపోలేదు. సాయంత్రం 8గంటలకు ముగ్గురం పోయి బట్టల దుకాణంలో ఓ డ్రాయర్, బనీన్, అంగి, లాగు కొనుక్కున్నాం. రాత్రి ఆడ పడుకోని పొద్దుగాల స్నానం చేసి పొద్దుగాల పనిచేస్కోని సాయంత్రం వచ్చాం. ఉన్నతాధికారి అయిన జోషి లాంటి మనిషి కూడా ఈ ప్రాజెక్టు కోసం సామాన్యుడిలాగే ఎంతో కష్టపడ్డారు. కళ్లుమూసుకున్నా కాళేశ్వరమే కనిపించేలా రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు భూసేకరణకోసం కష్టపడి 50 వేల ఎకరాల భూమిని అందించారు. వారందరికీ ధన్యవాదాలు” అని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో భాగస్వామ్యమై పనిచేయడం గొప్పగా అనిపిస్తోందనీ.. ఈ జన్మకు ఇంకా ఏదో కావాలని తనకు లేదని హరీష్ రావు అన్నారు. జీవితంలో ఓ మంచి పనిచేయగలిగాం.. అంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదని .. ఇది తన పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నా హరీష్ రావు అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: