ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. జబ్బు నయం కావాలంటే లక్ష, రెండు లక్షలు కాదు.. సుమారు 25 లక్షల రూపాయలు అవసరమవుతాయని వైద్యులు చెప్పడంతో, రోజు వారీ కూలి డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే తమకు అంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం సాధ్యం కాదని బెంగ పెట్టుకున్నారు.

 

ఏడాది నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. వీరి కుటుంబ పరిస్థితి తెలిసిన కొడుకు స్నేహితులు తమ మిత్రుడిని కాపాడుకోవాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఈనెల 4న విశాఖ శారదాపీఠం సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం విమానాశ్రయం వద్ద ‘సేవ్‌ అవర్‌ ఫ్రెండ్‌’ బ్యానర్‌తో నిల్చున్నారు.

 

కారులోంచి బ్యానర్‌ చూసిన ముఖ్యమంత్రి  కాన్వాయ్‌ని నిలిపి వారితో మాట్లాడారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విశాఖ జ్ఞానాపురానికి చెందిన తమ స్నేహితుడు నీరజ్‌కుమార్‌ వైద్యానికయ్యే ఖర్చు గురించి వారు సీఎంకు వివరించారు.

 

పూర్తి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నీరజ్‌కుమార్‌ వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, దిగులు చెందవద్దని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు నీరజ్‌కుమార్‌కు వైద్యం శరవేగంగా అందుతోంది. ఇప్పటికే వైద్యం కోసం రూ.10 లక్షలు ప్రభుత్వం నుంచి చెల్లించారు. ఇంకా ఎంత అవసరమైతే అంత సొమ్ము ప్రభుత్వమే సమకూరుస్తుందని కుటుంబ సభ్యులకు, ఆస్పత్రి వర్గాలకు సీఎంవో అధికారులు స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: