ఆంద్రప్రదేశ్ శాసనసభ ఐదు రోజుల సమావేశాలను గమనించిన వారికి మొదటి సమావేశం హాయిగా చూడడానికి ఇబ్బంది లేకుండా సాగిందని అనిపించలేదు. స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారామ్ ఒక వైపు అదికార పక్షం నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకుంటూనే ప్రతిపక్షానికి కూడా సముచితమైన రీతిలో అవకాశం ఇవ్వడం ముదావహం.
తమ్మినేని సీతారామ్ శాసనసభ్యుడుగా గత అనుభవం కొంత ఉపయోగం అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన స్వేచ్చ కూడా ఆయన విధినిర్వహణను మరింత సరళతరం చేసిందని చెప్పాలి. 

గతంలో గవర్నర్ ప్రసంగానికి దన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాదానం ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం అనేక సందేహాలు, ప్రశ్నలతో దాడిచేస్తుంది.  బహుశా మొదటిసారిగా ముఖ్యమంత్రి జవాబు ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం  ఒక్క ప్రశ్న కూడా సంధించక పోవటం అదికారపక్షం సాధించిన విజయంగా భావించవచ్చు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ప్రశ్నించే పరిస్థితే ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడుకు లేకుండా పోయిందని అనుకోవాలి. ప్రతిపక్షం అన్నాక ఏదో ఒక విమర్శ చేయకుండా ఉండ జాలరు. అవి నిజాలా? అవి అబద్ధాలా? అన్న మీమాంసతో  ఇక్కడ పనిలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన మొదటి నెల రోజుల లోపే అదికంగా విమర్శలు చేయడం కూడా కష్టమే. అయితే సహజంగానే ఇక్కడ గత ఐదేళ్ల టిడిపి పాలన గుర్తుకు వస్తుంది.ఆనాటి మొదటి అసెంబ్లీ సమావేశాలు గుర్తుకు వస్తాయి.

అప్పట్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షంగా అరవై ఏడు మంది ఉండడంతో ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా ఉండేది. దానికి తోడు టిడిపి అసాధారణమైన, ఆచరణ సాద్యం కాని అనేక హామీలు ఇచ్చి అదికారంలోకి రావడం, వాటి నుండి రక్షణ కోసం నానా అవస్తలు పడవలసి వచ్చింది. ఉదాహరణకు చంద్రబాబు సంతకాలు పెట్టిన మొదటి ఐదు ఫైళ్ల విషయంలోనే గందరగోళం ఏర్పడింది. ఉదాహరణకు రైతులకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కాని అది ఎలా అమలుపరచాలన్న దానికి దారి దొరకక సమస్యలు ఎదుర్కున్నారు. కాని కొత్త ముఖ్యమంత్రికి ఆ ఇబ్బంది లేదు. అలాంటి లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇవ్వలేదు. అంతేకాక తను ఏమి చెబుతూ వచ్చారో వాటిని మొదటి పదిహేను రోజులలోనే వీలైనతవరకు అనేకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ రకంగా ముఖ్యమంత్రి శాసనసభలో తన ప్రభుత్వంపై ఒక విశ్వాసం పాదుగొలిపారు. ఋజువర్తనతో ఆత్మవిశ్వాసంతో ఎంతో అనుభవమున్న సభా నాయకుడులాగా మాట్లాడారు. గత ప్రభుత్వం తరహాలో అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన స్వతహాగానే అబద్ధాలు చెప్పదలచలేదు. ఆయన రైతు పెట్టుబడి సాయం గురించి ప్రకటన, అమ్మ ఒడి స్కీమ్, వైఎస్ పేరుతో రైతులకు సున్నావడ్డీకి రుణాలు, మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని ప్రకటించడం, రైతుల పంటల ధరల స్థిరీకరణ నిది పెడతామని, ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తామని గాని జగన్ తొలుత ప్రకటించకుండా అధికారంలోకి రాగానే ఒక క్రమపద్దతిలో ప్రకటించారు దాంతో ప్రభుత్వం పట్ల ఆయన నాయకత్వం పట్ల జనవిశ్వాసం పదింతలైంది.  

అలాగే స్కూళ్లకు సంబందించి, నవరత్నాల స్కీముల గురించి నిర్దిష్టంగా చెప్పిన తీరు ఆయా వర్గాలను ఆకట్టుకునేలా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం జెట్ స్పీడ్ లో నడుస్తోందన్న భావనను కలిగించ గలిగారు సీఎం.  అయితే ఇప్పటికీ అనేక మందికి కొన్ని సంశయాలు లేకపోలేదు. ప్రభుత్వం ఒక రకంగా ఆర్దికంగా సంక్షోభం ఎదుర్కుంటున్న తరుణంలో రైతులకు ₹12500/- చొప్పున కాని, అమ్మ ఒడి కింద ₹15000/- ఇవ్వడానికి ఎంత డబ్బు అవుతుంది. అది ఎలా సమకూర్చుకోగలుగుతారు? అన్నది ఆసక్తికరమైన విషయమే. 

మాజీ ఆర్దికమంత్రి ఆలోచనల ప్రకారం వీటన్నిటికి ₹43000 కోట్లు అవసరం అని తేల్చారు. అయితే టిడిపి నేతలు తమ హాయాంలో రైతులకు బకాయిపడ్డ రుణమాఫీ కూడా కట్టాలని డిమాండ్ చేయడం చిత్రమైన అంశమే. ఎందుకంటే టిడిపి వారు తాము రుణమాఫీ చేయడంలో విఫలం అయ్యామని, మోసం చేసినట్లే అయిందని చెప్పకుండా కొత్త ప్రభుత్వాన్ని ఇలా అడుగుతున్నారు. నలభై ఏళ్ల సుధీర్ఘ అనుభవశీలి అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు.  ఉపనేత అచ్చెన్నాయుడు మాత్రం గత ఐదేళ్లలో బాబు ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసిందని వాదించే ప్రయత్నంచేసి ధారుణంగా భంగపడ్డారని చెప్పాలి. 

ఇక శాసనసభ ఆర్దిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సమర్దంగా తన బాద్యతలు నిర్వహించారని చెప్పాలి. పోలవరం, రాజదాని, రుణమాఫీ వంటి అంశాలలో టిడిపి నేతలు చేసిన వాదనను ఆయన తిప్పికొట్టగలిగారు. 

అలాగే ఆర్కె రోజా,అంబటి రాంబాబు వంటివారు తమదైన శైలిలో - గవర్నర్ ప్రసంగానికి దన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగాలు చేశారు. భూమన కరుణాకర రెడ్డి తన సాహిత్య ప్రతిభను కూడా వాడి మాట్లాడారు. కాకాణి గోవర్ధనరెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన అనేక అక్రమాలను ఎండగట్టడమే కాకుండా, టిడిపి కార్యకర్తలపై జరుగుతు న్న దాడులంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆదారసహితంగా చెప్పడంతో టిడిపి నేతలు దానికి జవాబు కూడా ఇవ్వలేకపోయారు. 

ఈ సంఘటనలను బట్టి ప్రతిపక్షనేత పాత్రలో చంద్రబాబు ఇంకా ఇమడటానికి ఇబ్బంది పడినట్లే కనిపించింది. నవయువకుడు తన అనుభవంలో సగమంత వయసు న్న వైఎస్ జగన్మోహనరెడ్డి లాంటి వ్యక్తి, అంతకుమించి గత ఐదేళ్ళుగా పగ ప్రతీకారంతో ఎవరివలననైతే తాను రగిలిపోతూవస్తున్నాడో అతనే ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోవడానికి చంద్రబాబుకు ఇంకా చాలా సమయం పట్టవచ్చు.

అందువల్ల శాసనసభాధిపతి (స్పీకర్) తమ్మినేని సీతారామ్ ను - సభాపతిస్థానం వద్దకు మర్యాదపూర్వకంగా తీసుకువెళ్లడానికి ముందుకు రాలేకపోయారు. అందువల్ల వెల్లువైన విమర్శలతో ఉప సభాపతి రఘుపతి ఎన్నిక తర్వాత మాత్రం ప్రొటోకాల్ అనుసరించి ముఖ్యమంత్రితో పాటు ముందుకు నడిచారు. శాసనసభలో గత ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కున్న అనేక ఇబ్బందులను కొందరు సభ్యులు ఆవేశ పూరితంగా వివరించినా వారు ఎక్కడా అనుచితంగా వ్యవహరించ లేదు. మొదటి రెండు రోజులలోనే అత్యదిక సంఖ్యలో సభ్యులు ప్రసంగాలు చేయడం కూడా ఈ శాసనసభ తొలి సమావేశం ప్రత్యేకత అని చెప్పాలి. 

చివరిగా ప్రత్యేక హోదాపై మరోసారి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం ద్వారా తమ చిత్తశుద్దిని తెలియచేసే ప్రయత్నాన్ని కొత్త ప్రభుత్వం నూతన శాసనసభ నాయకుడుగా వైఎస్ జగన్మోహనరెడ్డి చేశారనే చెప్పాలి. శాసనసభ తొలి సమావేశంలోనే సీఎం జగన్మోహనరెడ్డి, అధికార వైసీపి శాసనసభ్యులు హుందాగా వ్యవహరించడం ద్వారా శాసనసభకు ఒక వన్నె గౌరవం తెచ్చారని చెప్పవచ్చు. సమావేశాలను ఎంతో హుందాగా తనదైన శైలిలో నిర్వహించడం ద్వారా తమ్మినేని సీతారాం పాత తరం సభాధిపతుల కోవలోకి చేరిపోయినట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: