-  అద్దెకని నమ్మబలికి ఇతరులకు తనఖా పెట్టేశారు
మాయమాటలతో యజమానులను నమ్మించి కార్లను విక్రయించేందుకు సిద్ధమైన ఇద్దరు నిందితులను అనంతపురం త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండీ 29 కార్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.


 ఆయన మాటల్లోనే... తాడిమర్రి మండలం పొడ్రాళ్ల జయచంద్రారెడ్డి, కర్నూలు జిల్లా మద్దికెర మండలం బురుజల గ్రామానికి చెందిన దర్శి దినేష్ లను అరెస్టు చేశాం. జయచంద్రారెడ్డి ఎం.బి.ఎ వరకు చదువుకుని ధర్మవరం పట్టణంలో సివిల్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. దర్శి దినేష్ బి.టెక్ పూర్తీ చేసి ఓ బ్యాంకులో పని చేస్తూ సస్పెండ్ అయ్యాడు. వీరిద్దరూ స్నేహితులు. వీరికున్న వ్యసనాలు, జల్సాలను తీర్చుకునేందుకు ఘరానా మోసానికి పాల్పడ్డారు. కార్ల యజమానులకు మాయమాటలు చెప్పి అద్దె పేరుతో వాహనాలను తీసుకుని ఏకంగా వాటిని ఇతరులకు తనఖా పెట్టారు. ఇలా... ఈ ఏడాది ఫిబ్రవరి నుండీ 29 కార్లను నమ్మబలికి యజమానుల నుండీ తీసుకున్నారు. 


ఇందులో... అనంతపురం త్రీటౌన్ ,  ఒన్ టౌన్ , టూటౌన్ , నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అనంతపురం డీఎస్పీ పి.ఎన్ బాబు పర్యవేక్షణలో త్రీటౌన్ సి.ఐ బాల మద్ధిలేటి, ఎస్ ఐ జయపాల్ రెడ్డి , ఎ.ఎస్ .ఐ రమణ, హెడ్ కానిస్టేబుళ్లు ఫిరోజ్ , తిరుమలేష్ , కానిస్టేబుళ్లు భార్గవ, హరి, పాండులు కలసి ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఇతరుల వద్ద తనఖా పెట్టిన 29 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 29 కార్లను కోర్టుకు అప్పగించనున్నారు. ఈ వాహనాలు విడుదలకు కోర్టు అనుమతి పొందాలి. వాహనాలకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించి వారి అనుమతితో కార్లను ఆయా యజమానులు తీసుకోవాల్సి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: