అనూహ్య రీతిలో తెలుగుదేశం పార్టీకి షాకిస్తూ...రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేస్‌, టీజీ వెంక‌టేష్‌, గ‌రిక‌పాటి మోహ‌న్ రావు బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. వీరి చేరిక వెనుక రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల కంటే...కేసుల‌, ఆర్థిక సంబంధ‌మైన స‌మ‌స్య‌లే ఎక్కువ కార‌ణ‌మ‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేష్‌పై తీవ్ర‌మైన ఆర్థిక అభియోగాలు ఉన్న నేప‌థ్యంలో...వాటి నుంచి కాపాడుకునేందుకే...కాషాయ కండువా క‌ప్పుకొన్నార‌నే టాక్ వినిపించింది. ఈ విష‌యంలో  భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అభియోగాలు ఉండి తమ పార్టీలో చేరుతున్న టీడీపీ ఎంపీలకు తాము ఎటువంటి హామీలు ఇవ్వలేదని, వారు విచార‌ణ‌ను ఎదుర్కోవాల్సిందేన‌ని అన్నారు. ఈ ఎపిసోడ్ వారిలో క‌ల‌వ‌రం సృష్టించిన నేప‌థ్యంలో..తాజాగా అమిత్ షా ఎంట్రీ ఇచ్చారంటున్నారు.


ఎంపీ జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ... రాజ్యసభలో తమ సంఖ్యాబలం తక్కువగా ఉన్నందునే తెలుగుదేశం సభ్యులను చేర్చుకుంటున్నామ‌ని...అభియోగాలు ఉండి తమ పార్టీలో చేరుతున్న టీడీపీ ఎంపీలకు తాము ఎటువంటి హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను టీడీపీ రాజ్యసభ సభ్యులను విమర్శించింది నిజమేనని, వారు కూడా తమను విమర్శించారన్నారు. దేశాభివృద్ధిని కాంక్షించే తాము బీజేపీలో చేరినట్లు టీడీపీ సభ్యులు చెప్పారన్నారు. వారిపై వచ్చిన అభియోగాలపై వారే సమాధానం చెప్తారని, తమ పార్టీలో చేరిన వారికి మంచివారు అని తాము సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. అయితే, ఈ ప‌రిణామం క‌ల‌క‌లం సృష్టించిన నేప‌థ్యంలో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. త‌మ పార్టీలో చేరిన నేత‌ల గురించి సానుకూల వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌, సుజనా చౌదరి తదితరులపై ఆర్థికపరంగా కేసులేమి లేవనీ... కేవలం ఆరోపణలు మాత్రమేనని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్ర‌క‌టించారు. బీజేపీలోకి వచ్చిన నలుగురు ఎంపీలపై ఆరోపణలే తప్ప చార్జిషీట్లు, కేసులు లేవని కిషన్‌ రెడ్డి వివరించారు. ఈ విషయంలో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేయోద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వారిపై ఉన్న ఆరోపణలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.


చట్టబద్ధంగానే ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారని కిష‌న్‌రెడ్డి అన్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన టీడీపీ, కాంగ్రెస్‌లు తమ పార్టీని ఈ విషయంలో విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన హెచ్చరించారు. నలుగురు సభ్యులు గ్రూపుగా ఏర్పడి ఒక తీర్మానం చేసుకుని రాజ్యసభ చైర్మెన్‌ కు సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం రాజ్యాంగబద్ధంగానే బీజేపీలో విలీనమయ్యారని కిషన్‌ రెడ్డి చెప్పారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ నిబంధన ప్రకారం ఇప్పటికే రాజ్యసభలో పదహారుసార్లు విలీనాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఆనాడు ప్రజాప్రతిధులు తమ పార్టీలోకి చేర్చుకోవడమే కాకుండా వారికి రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు కూడా ఇచ్చిన టీడీపీ కాంగ్రెస్‌లు ప్రస్తుతం విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఉపరాష్టపతి, రాజ్యసభ చైర్మెన్‌ చట్ట ప్రకారంగానే వ్యవహరించి ఈ విలీన ప్రక్రియను పూర్తి చేశారన్నారు. బీజేపీలో ఒక గ్రూప్‌గా చేరుతున్నట్టు తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, రాజ్యసభ చైర్మెన్‌ కు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపు చట్టాలకు లోబడే నలుగురు రాజ్యసభ సభ్యులు చేరారని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: