ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలన్నారు. అనుమతిలేని అన్ని భవనాలను కూలిస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. తెదేపా ప్రభుత్వం దాదాపు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతుల్లేవని అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. 

 

గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు లింగమనేని పూర్ణభాస్కరరావు, కుటుంబ సభ్యులు పవన్‌కు స్వాగతం పలికారు.

 

 ఆలయంలో నిర్వహించిన 108 కలశాల పూజలో పవన్‌ కల్యాణ్‌తో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని, అలాకాకుండా ఒక్క ప్రజావేదిక మాత్రమే కూల్చాలనుకుంటే సరికాదన్నారు.

 

ఐతే, ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులతో అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. జనసేన పార్టీ కమిటీల నిర్మాణం, ప్రజా సంబంధిత కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న అంశంపై నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: