ఒకే ఒక్క నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల దశనే మార్చేస్తోంది. చంద్రపాళెం స్కూల్లో 10 రోజుల్లో 1031 మంది విద్యార్ధులు అడ్మిషన్లు తీసుకున్నారంటేనే అర్ధమైపోతోంది పథకం ఎంత సక్సెస్ అయ్యిందో.  నవరత్నాల్లో కానీ తర్వాత పాదయాత్రలో కానీండి జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రస్తావించిన హామీల్లో ’అమ్మఒడి’ పథకం కూడా ఒకటి. ఆ పథకంతో ఏమవుతుందిలే అని చాలామంది అనుకున్నారు.

 

సీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి రాగానే అమ్మఒడి పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చే జనవరి 26వ తేదీ నుండి పథకం అమల్లోకి రానున్నట్లు ప్రకటించేశారు. దాని విధి విధానాలను కూడా నిర్ణయించేశారు. ఇంకేముంది జగన్ ప్రకటన దెబ్బకు ప్రైవేటు స్కూళ్ళపై బాగానే ప్రభావం పడింది.

 

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళల్లో  పెద్దగా విద్యార్ధులుండరన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అదంతా పోయిన విద్యా సంవత్సరం వరకూ కరెక్టే. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ప్రభుత్వ స్కూళ్ళు కిటకిట లాడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో తమ స్కూళ్ళల్లో అడ్మిషన్లు అయిపోయాయని బోర్డులే పెట్టేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు రద్దీ ఏ స్ధాయిలో ఉందో.

 

ఈ విషయంలో విశాఖపట్నంలోని ఓ ప్రభుత్వ పాఠశాల రికార్డులను తిరగరాసింది. జిల్లాలోని చంద్రపాలెంలో  ప్రభుత్వ ఉన్నత పాఠశాలుంది. గడచిన పది రోజుల్లో సుమారు 1031 మంది విద్యార్ధులు అందులో అడ్మిషన్లు తీసుకున్నారు. 10 రోజుల్లో వెయ్యిమందికి పైగా కొత్తగా ఒకే ఉన్నత పాఠశాలలో అడ్మిషన్లు తీసుకోవటమన్నది రికార్డనే చెప్పాలి.

 

తెలుగురాష్ట్రాల్లో అత్యధిక విద్యార్ధులున్న స్కూలుగా చంద్రపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల రికార్డు సృష్టించింది. ఈ స్కూల్లో 42 సెక్షన్లు ఉన్న ఈ స్కూల్లో 88 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మొత్తం మీద 3550 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: